మే 1 నుంచి వ్యాక్సినేషన్ లేదు : ఈటల



 18-44 ఏజ్ గ్రూపువారికి వ్యాక్సిన్ ఇవ్వలేము 


 కేంద్ర ప్రభుత్వ పెత్తనం, అనగదొక్కే చర్యలు 

 

కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా మే నెల 1వ తేదీ నుంచి తెలంగాణలో 18-44 ఏజ్ గ్రూపువారికి వ్యాక్సిన్ ఇవ్వలేమని రాష్ట్ర వైద్య మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్ర జనాభా అవసరాలకు సుమారు మూడున్నర కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమని, దానిపై స్పష్టత లేకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేయలేమన్నారు. కేంద్రం నుంచి ఎంత కోటా వస్తుందో కూడా అంచనా లేదన్నారు. అక్కడి నుంచి అందే వ్యాక్సిన్ డోసులకు అనుగుణంగా తెలంగాణలో అమలు ఆధారపడి ఉంటుందన్నారు. కరోనా సెకండ్ వేవ్‌ను అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రాలను అప్రమత్తం చేయలేదని ఆరోపించారు. దానికి నిదర్శనమే ఎన్నికలు, కుంభమేళా లాంటి నిర్వహణ అని ఉదహరించారు. సచివాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.


రాష్ట్రాలకు సహకారం అందించాల్సిన బాధ్యతను తుంగలో తొక్కి పెత్తనం చేయడం, నియంత్రించడంపైనే దృష్టి పెట్టిందన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్రాలకు కేంద్రం నుంచి పెద్దగా ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రాల విజ్ఞప్తులకు కేంద్రం నుంచి ఆశించిన స్పందన రావడంలేదన్నారు. తీవ్రతను అంచనా వేయడంలో కేంద్రం విఫలమైనందువల్లనే ఆక్సిజన్, రెమిడెసివిర్, వ్యాక్సిన్ తదితరాలకు కొరత ఏర్పడిందని వ్యాఖ్యానించారు. మూడు వేల రూపాయలకు అమ్మాల్సిన రెమిడెసివిర్ ఇప్పుడు మార్కెట్‌లో రూ. 30 వేలకు అమ్మే పరిస్థితిని చూస్తున్నామని, ఎక్కువ ధరకు అమ్మేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు.


ముందుగానే సెకండ్ వేవ్ తీవ్రతను, దాని ప్రభావాన్ని అంచనా వేసి రాష్ట్రాలను అప్రమత్తం చేసి ఉంటే ఇప్పుడున్న పరిస్థితిని చూసేవారం కాదని, తగిన జాగ్రత్తలు తీసుకోడానికి దోహదపడి ఉండేదన్నారు. రాష్ట్రాలకు ’ఫ్రీ హాండ్’ ఇవ్వకుండా కేంద్రం అన్నింటినీ తన ఆధీనంలో పెట్టుకుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆక్సిజన్ కొరత ఏర్పడిందని, ప్రాణవాయువు అందని కారణంగా వందలాది మంది చనిపోతున్నారని గుర్తుచేశారు. వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్, రెడ్డీస్ లాబ్ సంస్థల ప్రతినిధులతో ప్రధాన కార్యదర్శి చర్చలు జరిపారని గుర్తుచేశారు..

0/Post a Comment/Comments

Previous Post Next Post