ఏపీ సర్కారు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు చేసింది. ఇటీవలి వరకు కేసులు అధికంగా వచ్చిన ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆ రెండు జిల్లాల్లోనూ సడలింపు సమయాలు మార్చుతున్నట్టు ప్రకటించింది.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ నమోదయ్యేంత వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
మిగతా జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఈ జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి ఉంటుందని ఆదేశించారు.
50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు, జిమ్ లు, కల్యాణ మండపాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ సీట్ల మధ్య ఖాళీలతో సినిమా ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ సడలింపులు ఈ నెల 8వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి
Post a Comment