ఇక డ్రైవింగ్ పరీక్ష లేకుండానే లైసెన్స్ జారీ..



 జులై  ఒకటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన నిబంధనలు మారనున్నాయి. ఇకపై, ఎలాంటి డ్రైవింగ్ పరీక్ష లేకుండానే లైసెన్స్ జారీ చేయనున్నారు. కొత్త నిబంధనలకు కేంద్ర రహదారి, రవాణాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తాజా మార్గదర్శకాల ప్రకారం.. గుర్తింపు పొందిన (అక్రిడేటెడ్) డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో సిమ్యులేటర్, ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ తప్పనిసరి. ఈ కేంద్రాల్లో విజయవంతంగా డ్రైవింగ్ పరీక్ష పూర్తిచేసిన అభ్యర్థులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే మళ్లీ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించరు. ఫలితంగా అక్రిడేటెడ్ కేంద్రాల్లో డ్రైవింగ్ నేర్చుకున్న వారికి శిక్షణ పూర్తయిన వెంటనే లైసెన్స్ పొందే అవకాశం లభిస్తుంది.


కేంద్రం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. ద్విచక్ర, త్రిచక్ర, తేలికపాటి వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన గుర్తింపు పొందాలంటే కనీసం ఎకరా స్థలం అవసరం. వీటితోపాటు భారీ ప్యాసింజర్, సరుకు రవాణా వాహనాలు, ట్రెయిలర్స్ నడపడంలో శిక్షణ ఇవ్వాలనుకుంటే కనుక రెండెకరాల స్థలం ఉండాలి. రెండు తరగతి గదులతోపాటు కంప్యూటర్, మల్టీమీడియా ప్రొజెక్టర్‌ను కూడా ఉపయోగించాలి. తేలికపాటి, భారీ వాహనాల శిక్షణ తరగతుల కోసం సిమ్యులేటర్స్‌ను ఉపయోగించాలి. శిక్షణ కేంద్రానికి బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ తప్పనిసరి.


బయో మెట్రిక్ అడెండెన్స్ వ్యవస్థ , అర్హులైన శిక్షకులు, ఈ-పేమెంట్ సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. శిక్షణ ఇచ్చే వాహనాలకు బీమా తప్పనిసరి. శిక్షకులకు కనీసం 12వ తరగతి విద్యార్హత ఉండి, డ్రైవింగ్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. దీంతోపాటు మోటార్ మెకానిక్స్‌లో ప్రొఫిషియన్సీ టెస్ట్ సర్టిఫికెట్ అవసరం. డ్రైవింగ్ స్కూల్‌కు ఒకసారి మంజూరు చేసే అక్రిడిటేషన్ ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది.





0/Post a Comment/Comments

Previous Post Next Post