ఈటల నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా ....14న బీజేపీలో ఈటల చేరిక



 మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఇటీవల ఢిల్లీ బీజేపీ నేతలతో సమావేశం అనంతరం టీఆర్ఎస్ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు ఈటల ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా సమర్పించనున్నారు. ఉదయం 10-11 గంటల మధ్య గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం స్పీకర్ కార్యాలయానికి చేరుకుని రాజీనామా సమర్పిస్తారని తెలుస్తోంది.


ఈ నెల 14న ఉదయం ఢిల్లీ వెళ్లి అదే  రోజు బీజేపీలో చేరుతారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన రమేశ్ రాథోడ్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ, గండ్ర నళిని, బాబయ్య తదితరులు కూడా కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో వీరు ఆ పార్టీ కండువా కప్పుకుంటారు.  


ఇక తనతోపాటు బీజేపీలో చేరనున్న నేతలను ఢిల్లీ తీసుకెళ్లేందుకు ఈటల ప్రత్యేక విమానాన్ని బుక్ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు వందమందికిపైగా నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే, ఈ విమానానికి సాంకేతిక అనుమతులు రావాల్సి ఉందని బీజేపీ నేతలు తెలిపారు.



Post a Comment

Previous Post Next Post