ఆదివాసీల గ్రామాన్ని రిజిస్టర్ చేయించుకున్న ఘనుడు .. విచారణ చేపట్టి అధికారులు



 తెలంగాణ రాష్ట్రం: నిర్మల్ జిల్లాలో 19 ఏళ్ల క్రితం జరిగిన దారుణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. జిల్లాలోని పెంబి మండలంలోని వేణునగర్‌ ఆదివాసీలు గతంలో అటవీ ప్రాంతంలోని కొత్తచెరువుగూడలో నివసించేవారు. ఆ గ్రామం నుంచి పెంబి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కనే ఉన్న 4.32 ఎకరాల (అసైన్డ్) వ్యవసాయ భూమిని  రూ. 60 వేలకు కొనుగోలు చేసిన ఆదివాసీలు అక్కడ గుడిసెలు వేసుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.


ఇదే భూమిని 2002లో పెంబికి చెందిన ఓ వ్యాపారి కొన్న వారికి కానీ, విక్రయించిన వారికి కానీ తెలియకుండా తన భార్య పేరున గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ప్రస్తుతం ఈ భూమి ధర కోటి రూపాయలకు పైగా పలుకుతోంది. ‘ధరణి’లో ఈ భూమి వ్యాపారి పేరుపైనే అసైన్డ్ భూమిగా నమోదై ఉండడం గమనార్హం. అంతేకాదు, గత మూడేళ్లుగా రైతు బంధు సాయం కూడా అందుకుంటుండడం గమనార్హం.తాజాగా వ్యాపారి వచ్చి ఆ భూమి తనదేనని చెప్పడంతో రైతులు విస్తుపోయారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సర్పంచ్ రాధతో కలిసి తహసీల్దార్‌కు గ్రామస్థులు విన్నవించారు. తమకు పట్టాలు ఇవ్వమంటే ఇవ్వని అధికారులు వ్యాపారికి మాత్రం అక్రమంగా పట్టా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రాజమోహన్ తెలిపారు.





0/Post a Comment/Comments

Previous Post Next Post