గుంటూరు: చోరులపై నిఘా పెట్టి వారిని అరెస్టు చేయాల్సిన ఒక పోలీసు నేరస్థుల ముఠాకు అండగా ఉన్నాడు. చోరీ సొత్తును విక్రయించిపెడుతూ అందులో వాటా తీసుకుంటున్న వైనాన్ని గుంటూరు నల్లపాడు పోలీసులు గుట్టురట్టు చేశారు.
ఐదుగురు సభ్యుల ముఠాలో హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మిగిలిన వారిని అరెస్టు చేశారు. పోలీసు కార్యాలయంలో శనివారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి విలేకరులకు తెలిపారు. వెంగళాయపాలెంకు చెందిన వృద్ధురాలు పువ్వాడ విజయలక్ష్మి గత ఏడాది డిసెంబరు ఏడో తేదీ మధ్యాహ్నం ఇంట్లో టీవీ చూస్తుండగా ముగ్గురు యువకులు ప్రవేశించి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కుని వెళ్లగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఐ వీరాస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా ఇది పాత నేరస్థుల పనిగా గుర్తించారు. పిడుగురాళ్ల మండలం చెన్నాయపాలెంకు చెందిన చింతలపూడి సాగర్‌బాబు, బ్రాహ్మణపల్లికి చెందిన పాదర్తి సురేష్‌బాబు, గురజాల మండలం చర్లగూడిపాడుకు చెందిన అచ్చి చిన్న సైదారావు అని తేలింది.
వారిపై పిడుగురాళ్ల, అచ్చంపేట, దుర్గి, రెంటచింతల, సత్తెనపల్లి, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటలో కేసులు ఉన్నట్లు గుర్తించారు. చిన్నసైదారావుపై 33 కేసులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
ఉప కారాగారంలో పరిచయం..
అనేక కేసులతో సంబంధం ఉన్న ముఠాను అరెస్టు చేయడానికి నేర విభాగ ఏఎస్పీ మనోహరరావు, సీసీఎస్ డీఎస్పీ ప్రకాష్‌బాబు, దక్షిణ వలయ విభాగ డీఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో సీఐ వీరాస్వామి, ఎస్సై ఆరోగ్యరాజు సిబ్బందితో రంగంలోకి దిగారు.
ముగ్గురు సభ్యుల ముఠా వెనుక ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నట్లు తెలుసుకుని నిర్ఘాంతపోయారు. సీఐ వీరాస్వామి లోతుగా దర్యాప్తు చేయగా స్నేహితులైన ముగ్గురు నిందితులు చోరీలు చేసి గతంలో గురజాల ఉప కారాగారానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కుమ్మెర్ల బసవరాజుతో వారికి పరిచయం ఏర్పడింది.
ప్రస్తుతం అతను ఫిరంగిపురం పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. చోరీ సొత్తు తీసుకొస్తే తాను విక్రయించిపెడతానని నిందితులతో ఒప్పందం చేసుకున్నాడు. బంగారు నగలు తీసుకొచ్చి ఇవ్వగా సత్తెనపల్లికి చెందిన వ్యాపారి ఆతుకూరి నాగేశ్వరరావు వద్ద విక్రయిస్తూ అందులో కమీషన్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అనేక చోరీలకు సంబంధించిన నగలు అతను విక్రయించినట్లు నిందితులు పోలీసుల వద్ద తెలిపారు. ఈ ముఠాలోని ప్రధాన నిందితుడు సాగర్‌బాబు ఇప్పటికే ఒక కేసు విషయమై సత్తెనపల్లి కారాగారంలో ఉన్నాడు. మిగిలిన వారిలో చినసైదారావు, సురేష్‌తో పాటు దొంగ బంగారమని తెలిసి విక్రయించిన హెడ్ కానిస్టేబుల్ బసవరాజు, చోరీ సొత్తు కొనుగోలు చేసిన వ్యాపారి నాగేశ్వరరావులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద 62 గ్రాముల బంగారం జప్తు చేశామన్నారు. ముఠాను అరెస్టు చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
Post a Comment