ఇండియా లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. గత 24 గంటల్లో 3,52,991 మంది కరోనా బారిన పడగా... ఏకంగా 2,812 మంది మృతి చెందారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ను అందిస్తున్న భారత్ లో ఈ స్థాయిలో కరోనా పంజా విసరడంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ కు తాము అన్ని విధాలా సహాయ, సహకారాలను అందిస్తామని ముందుకొస్తున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 1,95,123 మంది కరోనా కారణంగా మృతి చెందారు.ఈ నేపథ్యంలో భారత్ కు చేయూతను అందించేందుకు టెక్ దిగ్గజం గూగుల్ ముందుకొచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కు రూ. 135 కోట్ల విరాళం అందిస్తున్నట్టు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఈ ఫండ్ ను గివ్ ఇండియాకు, యూనిసెఫ్ కు అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు.భారత్ కు సాయమందించేందుకు శత్రు దేశం పాకిస్థాన్ సైతం ముందుకు రావడం గమనార్హం. పాక్ తో పాటు బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, చైనా వంటి దేశాలు ముందుకొచ్చాయి. టీకా తయారీకి అవసరమైన ముడి పదార్థాలను భారత్ కు పంపించాలని అమెరికా నిర్ణయించింది. దీంతోపాటు పీపీఈ కిట్లు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. మన దేశంలో ఆక్సిజన్ కొరతను తీర్చే దిశగా బ్రిటన్, ఫ్రాన్స్ అడుగులు వేస్తున్నాయి.
Post a Comment