టీషర్ట్‌ తో అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఎమ్మెల్యే.. బయటకు పంపేసిన స్పీకర్

 


గుజరాత్  శాసనసభ సమావేశాలకు టీషర్ట్‌, జీన్స్‌ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్‌ చూడసమాకు చేదు అనుభవం ఎదురైంది. స్పీకర్ రాజేంద్ర త్రివేది అయనను అసెంబ్లీ నుండి బయటకు పంపించేశారు. గుజరాత్‌లోని సోమనాథ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విమల్.. నల్ల రంగు టీషర్ట్‌ ధరించి సోమవారం అసెంబ్లీకి వచ్చారు. ఆయన ఆహార్యంపై స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో ఆగ్రహానికి గురైన సదరు ఎమ్మెల్యే.. టీషర్ట్‌ ధరించి అసెంబ్లీకి రావొద్దనే చట్టాలేమైనా ఉన్నాయా..? ఉంటే అవి సభ ముందుకు తీసుకురావాలంటూ పట్టుబట్టారు. దీంతో స్పీకర్‌ ఆయనను తక్షణమే సభ నుంచి బయటకు పంపించేయాలని ఆదేశించారు. చివరకు బలప్రయోగం అవసరం లేకుండానే మార్షల్స్‌ ఎమ్మెల్యేను బయటకు పంపించారు.మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే దుస్తులు ధరించాలని స్పీకర్‌ త్రివేది గతంలోనే సభ్యులను కోరారు. అయినప్పటికీ.. విమల్‌ సోమవారం స్పీకర్‌ సూచనలను బేఖాతరు చేశారు. ఈసారి ఆయన చర్యలను తీవ్రంగా పరిగణించిన స్పీకర్‌ కఠినంగా వ్యవహరించారు.  విమల్‌ సభ నుంచి బయటకు వెళ్లిన తర్వాత భాజపా సభ్యుడొకరు ఆయనను మూడు రోజుల పాటు సస్పెండ్‌ చేయాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు.మధ్యలో కలగజేసుకున్న ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.. తీర్మానాన్ని వెనక్కి తీసుకునేలా చేశారు. విమల్‌కు అర్థమయ్యేలా చెప్పాలని కాంగ్రెస్‌ సభ్యులకు సూచించారు. గతంలో భాజపాకు చెందిన ఎమ్మెల్యే కూడా సభకు టీషర్ట్‌తో వచ్చారని.. కానీ, స్పీకర్ ఆదేశించడంతో వెంటనే దాన్ని మార్చుకొని తిరిగి సభకు హాజరయ్యారని గుర్తు చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post