ప్రస్తుతము మార్కెట్లో లభించే పెట్రోల్ కంటే అత్యున్నత నాణ్యత కలిగివుండే 100 ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్ హైదరాబాదులోనూ లభ్యమవుతోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఇటీవలే హైదరాబాదులో ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ అమ్మకాలు షురూ చేసింది. ఈ 100 ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.160 ధర పలుకుతోంది. ఈ వరల్డ్ క్లాస్ పెట్రోల్ వాహనాల మన్నికను మరింత పెంచుతుందని, ఇంజిన్ జీవితకాలాన్ని పొడిగిస్తుందని ఐఓసీ డీలర్ల కన్సార్టియం సంయుక్త కార్యదర్శి రాజీవ్ అమరం తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ ప్రీమియం స్థాయి పెట్రోల్ ను గతేడాది నుంచి ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఆగ్రా, ముంబయి, అహ్మదాబాద్, చండీగఢ్, జైపూర్, లుధియానా నగరాల్లో విక్రయిస్తున్నారు. కాగా, ఈ నాణ్యమైన పెట్రోల్ మధురలోని ఐఏసీ రిఫైనరీ నుంచి సరఫరా చేస్తున్నారు. బీఎస్-6 వాహనాలకు ఈ పెట్రోల్ సరైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Post a Comment