ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ అయ్యాయి. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలపై నిమ్మగడ్డ గవర్నర్ కు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు. ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి నిమ్మగడ్డకు నోటీసులు పంపారు. ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.మంత్రులపై నిమ్మగడ్డ ఇచ్చిన ఫిర్యాదుపై నిన్న అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అత్యవసరంగా భేటీ అయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఆ సమావేశంలో నిమ్మగడ్డ ఫిర్యాదుపై చర్చించారు. ఈ సమావేశంలో నిమ్మగడ్డకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. మంత్రులపై ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఈనెల 19 నుంచి 22 వరకు సెలవుపై వెళ్లేందుకు నిమ్మగడ్డ నిర్ణయించుకున్నారు. అయితే, ప్రివిలేజ్ కమిటీ నోటీసుల నేపథ్యంలో ఆయన సెలవుపై వెళ్తారా? లేదా సెలవును రద్దు చేసుకుంటారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రివిలేజ్ కమిటీ ముందు ఆయన హాజరుకాకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
Post a Comment