తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో పోలీసులు తాజాగా ఓ రిటైర్డ్ ఇంజినీర్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది. మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఇంజినీర్ వెల్ది వసంతరావు (62)ను నిన్న అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.గ్రామంలో నిర్మిస్తున్న పెద్దమ్మగుడిని అడ్డుకునేందుకు వామనరావు నోటీసులు ఇప్పించాడని వసంతరావు తరచూ చెబుతూ బాధపడేవాడు. దీనికి తోడు కోర్టులో కేసు వేస్తానని, వసంతరావు, అతడి కుమారుడి అవినీతి బాగోతాన్ని బయటపెడతానని, ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని వామనరావు బెదిరించాడు.దీంతో ఈ విషయాన్ని ఆయన కుంట శ్రీనుకు చెప్పుకుని వాపోయాడు. తనను ఇబ్బందులకు గురిచేస్తున్న వామనరావును చంపెయ్యాలని కుంట శ్రీనును కోరాడని పోలీసులు తెలిపారు. వామనరావు దంపతుల హత్య కేసులో ఆయన కూడా భాగస్వామిగా ఉండడంతో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు చెప్పారు.
Post a Comment