భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సీతమ్మ సాగర్ బహులార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణం వలన చర్ల మండలంలో గోదావరి నడిమధ్య లంకల్లో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని మాలమహానాడు రాష్ట్ర నాయకులు తడికల లాలయ్య డిమాండ్ చేశారు. మాలమహానాడు జిల్లా నాయకులు తోటమల్ల వరప్రసాద్, చర్ల మండల మాలమహానాడు అధ్యక్షులు తోటమల్ల గోపాలరావు, మండల కమిటీ సభ్యులు గుండ్ల కృపావరంతో కలిసి ఆయన మంగళవారం చర్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కోరెగడ్డపై చెట్టుపుట్టలు బాగుచేసుకొని ఎన్నో ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్న వారంతా గోదావరి పరివాహక ప్రాంతాలలోని ఎస్‌సి, ఎస్‌టి, బడుగుబలహీన వర్గాలకు చెందిన పేదలే అని తెలిపారు. వారికి ఆ భూములు తప్ప పట్టాభూములు లేవన్నారు. వాటి ఆధారంగానే ఒకప్పటి నిరుపేదలు, నేడు సన్న,చిన్నకారు రైతులుగా జీవనం సాగిస్తున్నారని తెలిపారు. పేదల బతుకులను మార్చేసిన భూములను సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ముంచేస్తోందని తెలిసి రైతు కుటుంబాలు తల్లడిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బతకడానికి ఉన్న ఏకైక ఆధారం పోతే మళ్ళీ నిరుపేద కూలీలుగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు. అందుకే గడ్డలపై భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న వారిలో ఎక్కువమంది పేదలు, మాలలు ఉన్నందున బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు, అమరజీవి పివిరావు వారసులుగా ఉద్యమిస్తామని తెలిపారు. ఇప్పటివరకు అనేక సమస్యలపై కలసికట్టుగా పోరాటం చేసిన మాలలు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అవకాశవాదంగా, పదవుల వ్యామోహంతో మాయమాటలు చెప్పుకుంటూ నమ్మించి నట్టేట ముంచడానికి వచ్చే వారిపట్ల మాలలు అప్రమత్తంగా ఉండాలని లాలయ్య హెచ్చరించారు. చెప్పినట్లు వింటే పదవులు, ఇది తప్పు అని ప్రశ్నిస్తే పై నాయకత్వాలకు చాడీలు చెప్పి పదవుల నుంచి తొలగించడం నియంత విధానమని, ఇలాంటి ద్రోహులను దగ్గరకు రానివ్వొద్దని చర్ల మండల మాలలకి సూచించారు. ఈ సమావేశంలో తోటమల్ల రవికుమార్, తడికల నరేష్, కాకర్ల జయబాబు, తోటమల్ల నరసింహారావు, మేడబత్తిని గోవర్ధన్, తడికల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment