తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్ విమర్శించారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగ యువతీయువకుల జీవితాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువతకు 3016/- రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ దాని ఊసే ఎత్తడం లేదన్నారు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అనంతరం అనతి కాలంలోనే తన కూతురు కవితను ఎమ్మెల్సీగా గెలిపించుకోగలిగిన కేసీఆర్ ఉద్యోగ నియామకాలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రంలో అనేక మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారని,తప్పని పరిస్థితుల్లో కొందరు ప్రైవేటు ఉపాధ్యాయలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రవీందర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఏ ఒక్క సంవత్సరం కూడా బోధన బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించలేదని,బోధనా బకాయిల జాప్యం వల్ల అనేక ప్రైవేటు కళాశాలలు మూసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యారంగానికి పెద్దపీట వేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ దిశగా ఏమాత్రం చర్యలు చేపట్టకుండా ఆ రంగాన్ని పూర్తిస్థాయిలో భ్రష్టుపట్టించారని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి పాటుపడకుండా కేవలం టీఆర్ఎస్ నాయకులకు చెందిన ప్రైవేటుకళాశాలలు , యూనివర్సిటీలకు ప్రయోజనం చేకూర్చేందుకే పాటుపడుతున్నారని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18న రక్తదాన శిబిరాలు నిర్వహించాలని,అలాగే ఆస్పత్రులు,అనాధాశ్రమాల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులను కోరారు.ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు టేకుల శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మోతె రాజు,అధికార ప్రతినిధి రాజేశ్,నాయకులు ఆంజనేయులు,రాజ్ కుమార్, ప్రశాంత్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment