హత్రాస్ బాధిత కుటుంబానికి మూడంచెల భద్రత కల్పించేందుకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రభుత్వం భూల్గరీ గ్రామంలోని బాధిత కుటుంబం ఇంటి ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.కుటుంబ సభ్యుల అంగీకారం అనంతరం కెమెరాలను బిగించినట్టు హత్రాస్ జాయింట్ కలెక్టర్ ప్రేమ్ ప్రకాశ్ మీనా తెలిపారు. వారిని పరామర్శించేందుకు వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసేందుకు మెటల్ డిటెక్టర్లు కూడా ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అక్టోబరు 8లోగా తమకు తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది.మరోవైపు, బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ఊర్లో ఉండాలంటే భయంగా ఉందని, నిందలు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గురించి, తమ కుమార్తె గురించి ప్రచారమవుతున్న వదంతులు తమను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. చంపుతామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. కష్టపడి పనిచేయడం మాత్రమే తమకు తెలుసని, కాబట్టి ఎక్కడికైనా వెళ్లిపోయి బతుకుతామని అన్నారు. ఈ ఘటన తర్వాత గ్రామంలోని అందరూ తమను దూరం పెట్టడం మరింత కుంగదీస్తోందని వాపోయారు.
Post a Comment