130 కోట్లకు పైగా జనాభాతో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన్ననలందుకుంటున్న భారత్ కరోనా ప్రభావంతో దాదాపు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ప్రజారవాణా వ్యవస్థ స్థంభించిపోవడమే కాదు, జనజీవనం ఎక్కడిక్కడ నిలిచిపోయింది. మార్చి 25 నుంచి అమల్లోకి వచ్చిన 21 రోజుల లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆర్థికరంగ నిపుణులు ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు.ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించడంతో 70 శాతం ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు నిలిచిపోయాయని, పెట్టుబడులు, ఎగుమతులు, వస్తు వినిమయం ఎక్కడివక్కడే ఆగిపోయాయని పేర్కొన్నారు. భారత్ లో ఆర్థిక సంస్కరణలు, కేంద్రం ఉద్ధీపనలు, ద్రవ్య నియంత్రణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్న తరుణంలో కరోనా ప్రవేశించిందని, తద్వారా దేశ అభివృద్ధికి విఘాతం ఏర్పడిందని తెలిపారు.
అక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్ అంచనా ప్రకారం లాక్ డౌన్ కారణంగా రోజుకు రూ.35 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందట. ఆ లెక్కన 21 రోజుల లాక్ డౌన్ మొత్తానికి రూ.7.5 లక్షల కోట్ల మేర నష్టపోతుంది. లాక్ డౌన్ తొలి 15 రోజులకు గాను సరుకు రవాణా రంగం (లారీలు మాత్రమే) రూ.35,200 కోట్లు నష్టపోయిందని, ఓ లారీ సగటున రోజుకు రూ.2,200 నష్టపోయిందని ఆలిండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) సెక్రటరీ జనరల్ నవీన్ గుప్తా వెల్లడించారు.ఇక లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో రియల్ ఎస్టేట్ కూడా ఒకటి. కొనుగోళ్లు, విక్రయాలు నిలిచిపోవడంతో ఈ రంగానికి లక్ష కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. రిటైల్ వాణిజ్యం కూడా కనీవినీ ఎరుగని స్థాయిలో క్షీణత చవిచూసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ తీవ్రం కావడంతో మార్చి ద్వితీయార్థం నాటికి దాదాపుగా రూ.2.2 లక్షల కోట్ల మేర రిటైల్ వాణిజ్యం నష్టపోయినట్టు ట్రేడ్ వర్గాల అంచనా.
భారత్ లో రిటైల్ అమ్మకాల రంగంలో 7 కోట్ల చిన్న, మధ్య తరహా వ్యాపారులుండగా, వారి పరిధిలో 45 కోట్ల మంది పనిచేస్తున్నారు. దేశంలో ఈ రిటైల్ వ్యాపారమే నెలకు రూ. 6.5 లక్షల కోట్ల మేర జరుగుతుంది. లాక్ డౌన్ కారణంగా ఆయా రంగాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. లాక్ డౌన్ అనంతరం కేంద్రం తీసుకునే చర్యలు ఎలా ఉంటాయన్న దానిపై దేశ ఆర్ధిక వ్యవస్థ పునరుజ్జీవం ఆధారపడి ఉంటుంది.
Post a Comment