20 తరువాత కేసులు తగ్గితే లాక్ డౌన్ నిబంధనల సడలింపు : మోదీ



దేశ ప్రజలు అందరూ ఊహించినట్టుగానే, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కోరుకున్నట్టుగానే, ఇండియాలో లాక్ డౌన్ పొడిగించబడింది. కొన్ని రకాల పరిమితులతో కూడిన లాక్ డౌన్ ను అమలు చేసే దిశగా మోదీ నిర్ణయాలు తీసుకుంటారని తొలుత విశ్లేషణలు వచ్చినప్పటికీ, మోదీ సడలింపు యోచన చేయలేదు. కరోనా వైరస్ నుంచి ఇండియా ఇంకా బయట పడలేదన్న అభిప్రాయంతో ఉన్న మోదీ, సంపూర్ణ లాక్ డౌన్ ను పొడిగించాలనే నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని ఆయన దేశ ప్రజలకు స్పష్టం చేశారు.ఇక ఇదే సమయంలో ఆయన కొన్ని ఊరట వ్యాఖ్యలూ చేశారు. ప్రస్తుతం రెడ్ జోన్, హాట్ స్పాట్ లు అమలవుతున్న ప్రాంతాల్లో 20వ తేదీ వరకూ మరింత కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. 20వ తేదీ తరువాత ఈ ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి నిబంధనల సడలింపు ఉంటుందని మోదీ వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాల సీఎంల మాటకు విలువనిచ్చిన నరేంద్ర మోదీ, లాక్ డౌన్ ను పొడిగిస్తూనే, 20వ తేదీ నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడితే, లాక్ డౌన్ నిబంధనల సడలింపు ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు. లాక్ డౌన్ పొడిగింపు విధి విధానాలపై స్పష్టమైన ప్రకటన బుధవారం నాడు ఉంటుందని తెలిపారు.మోదీ వ్యాఖ్యల తరువాత, 20వ తేదీని లాక్ డౌన్ లో ఓ 'కామా'గా భావించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రజలంతా లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, రెడ్ జోన్, హాట్ స్పాట్ లో ఉన్నవారు సహకరిస్తే, మరో వారం తరువాత కేసుల సంఖ్య తగ్గుతుందని, ఆపై పరిస్థితి మెరుగుపడితే, నిబంధనల సడలింపు ఉంటుందని, ఈ వారం రోజుల పాటు గడ్డుకాలమేనని వ్యాఖ్యానించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post