టీడీపీ త్వరలో మూతపడుతుంది.. : ఆమంచి కృష్ణమోహన్​

ఏపీ సీఎం జగన్ ని మంత్రి బాలినేని శ్రీనివాసరావు, చీరాల వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ కలిశారు. అనంతరం, మీడియాతో ఆమంచి మాట్లాడుతూ, చీరాలలో రాజకీయంగా ఎలాంటి మార్పులు ఉండవని జగన్ తనతో చెప్పారని స్పష్టం చేశారు. ఇతర పార్టీలకు చెందిన నేతలను ప్రలోభాలకు గురి చేసి గతంలో చంద్రబాబు తమ పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. గతంలో టీడీపీలో చేరికలకు, ప్రస్తుతం వైసీపీలో చేరికలకు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. ఆరోజున వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలంటూ  ఎమ్మెల్యేల కాళ్లుచేతులూ పట్టుకున్నారని,  చాలా మంది ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారని  ఆరోపించారు. తమ పార్టీ గానీ, తమ నాయకుడు జగన్ గానీ అలా కాదని, తమ విధానాలు నచ్చినందువల్లే వైసీపీలో చేరుతున్నారని అన్నారు. వైసీపీలో చేరే వారికి తాము హామీలు ఇవ్వడం, పెద్ద పదవులు కట్టబెడతామని చెప్పడం వంటివి ఉండవని స్పష్టం చేశారు. టీడీపీని ఎంతోకాలంగా అంటిపెట్టుకుని ఉన్న నేతలు సైతం ఈరోజున వైసీపీలో చేరుతున్నారని అన్నారు. ఆరు నెలల నుంచి ఏడాదిలోపు టీడీపీ కచ్చితంగా మూతపడుతుందని, ఒక రాజకీయ పార్టీగా బతికిబట్ట కట్టే అవకాశం ఆ పార్టీకి లేదని జోస్యం చెప్పారు. టీడీపీ మూతపడుతుందన్న ఉద్దేశం ఉంది కనుకనే ఆ పార్టీని వీడుతున్నారని అన్నారు.   కాగా, ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ నేత కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేశ్ లు నిన్న జగన్ ని కలిసిన విషయం తెలిసిందే. జగన్ సమక్షంలో వైసీపీ లో కరణం వెంకటేశ్ చేరారు. ఈ నేపథ్యంలో జగన్ ని ఇవాళ ఆమంచి కలవడం ఆసక్తికరంగా మారింది.

Post a Comment

Previous Post Next Post