ఓ వైపు కరోనా వైరస్ దాడి, మరోవైపు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంటే దేశాన్ని నడిపించాల్సిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిద్ర పోతున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. అసలు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని పరిస్థితిలో మోదీ ఉన్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.సునామీ రాబోతోంది స్టాక్ మార్కెట్లు పడిపోవడం, వృద్ధి రేటు పడిపోవడం, ఆర్థిక మందగమనంతో దేశ ఆర్థిక వ్యవస్థపై సునామీ రాబోతోందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోందన్న ఆందోళన మోదీ ప్రభుత్వంలో కనబడటం లేదని, ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. డ్రైవింగ్ సీట్లో నిద్ర పోతున్నారు దేశంలో పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని నడిపించాల్సిన ప్రధాని మోదీ ‘డ్రైవింగ్ సీట్లో కూర్చుని నిద్ర పోతున్నారు’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. మన దేశం ఓ పెద్ద యాక్సిడెంట్ దిశగా ప్రయాణిస్తోందని పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ, ఆయన సిద్ధాంతాలు కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయి. కేంద్ర ఆర్థిక మంత్రి ఏమీ మాట్లాడటం లేదు. అసలు ఆమెకు ప్రస్తుత పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు. అందుకే ఏమీ మాట్లాడటం లేదు. కానీ ప్రధాన మంత్రి దీనిపై దేశ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిందే” అని రాహుల్ డిమాండ్ చేశారు.ఎకానమీ పరిస్థితి మాకు తెలుసు మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం పదేళ్ల పాటు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించిందని.. ఎలా నడపాలో, ప్రస్తుత పరిస్థితి ఏమిటో తమకు తెలుసని రాహుల్ గాంధీ అన్నారు. మోదీ వచ్చాక నోట్ల రద్దు, జీఎస్టీతో మొదలుపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు.
Post a Comment