ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ–జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని, అందులో భాగంగానే ఈరోజు విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విజయవాడలో బీజేపీ–జనసేన సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2014, 2019లో టీడీపీ ఎన్నికలు నిర్వహించలేదని, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ, ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని విమర్శించారు. ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించకుండా నాడు టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే, నేడు దౌర్జన్యపూరితంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలకు.. ముఖ్యంగా ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని విమర్శించారు. ‘క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్’ ని జనసేన, బీజేపీలు సంపూర్ణంగా నిరసిస్తున్నాయని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో యువతకు, కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో తాము ముందుకు వెళ్తుంటే, నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చిత్తూరు సహా కొన్ని జిల్లాల్లో అయితే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయాలంటే భయపడే పరిస్థితి కల్పించారని ధ్వజమెత్తారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ ఈ ఎన్నికలంటే ఎందుకు భయపడుతోంది? దౌర్జన్యంగా ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? అని ప్రశ్నించారు.
నామినేషన్లు వేసిన వారు ధైర్యంగా పోటీ చేయండి
కళ్లముందే దారుణం జరుగుతున్నా పట్టించుకోకపోవడం అంటే ‘క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్’ని ప్రోత్సహించడమే అవుతుందని, రాష్ట్ర ఎన్నికల సంఘం వారి బాధ్యతలు గుర్తెరిగి పనిచేయాలని పవన్ సూచించారు. ఎవరైతే నామినేషన్లు వేశారో వారు ధైర్యంగా పోటీ చేయాలని, బెదిరింపులకు లొంగొద్దని, ‘దెబ్బలు తిన్నా కానీ బలంగా నిలబడండి’ అని జనసేన, బీజేపీ అభ్యర్థులకు పిలుపు నిచ్చారు. వైసీపీ రౌడీయిజానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరమొచ్చిందని, ప్రజలందరూ కలిసికట్టుగా రావాలని కోరారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలి
నామినేషన్లు వేస్తుంటేనే ఇంత హింస చెలరేగుతుంటే, ఓట్లు వేయడానికి ఇక ఎవరు వస్తారు? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని, ఆయా విషయాలను తమ నాయకుల ద్వారా గవర్నర్ దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు.
Post a Comment