9 నెలల్లో 180 మందిపై అత్యాచారాలు..నిందితుల్లో వైసీపీవాళ్లే ఎక్కువగా ఉన్నారు : చంద్రబాబు విమర్శలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై విమర్శలు గుప్పించారు. ‘ఎక్కడైతే స్త్రీ సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు, రాష్ట్రం సంతోషంగా ఉంటాయి. అందుకే ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో మహిళల ప్రగతి, ఆనందమే లక్ష్యంగా పనిచేశాం. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరు క్షణం నుంచే మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఏర్పడింది’ అని తెలిపారు. ‘రాజధాని అమరావతి కోసం 82 రోజులుగా మహిళలు దీక్షలు చేస్తున్నారు. అవమానాలు, అరెస్టులు, లాఠీదెబ్బలే వారి ఆందోళనకు ఈ ప్రభుత్వం చెబుతున్న సమాధానం. మరోవైపు రేషన్ కార్డులు, పింఛన్లు పోయి ఎంతో మంది మహిళలు బతుకు బెంగతో ఉన్నారు. ఇంకోవైపు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి’ అని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఈ ప్రభుత్వం వచ్చాక 9 నెలల్లో 180 మంది ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగాయి. వీరిలో 33 మంది చిన్నారులు ఉన్నారంటే ఎంత అమానవీయం? బాధితుల్లో బడుగువర్గాలవారు ఎక్కువగా ఉండగా, నిందితుల్లో వైసీపీవాళ్లే ఎక్కువగా ఉన్నారు. దిశ చట్టం తెస్తే సంతోషించాం. కానీ సమాజాన్ని ఏ దిశకు తీసుకుపోతున్నారు?’ అని ప్రశ్నించారు.  ‘క్షమయా ధరిత్రీ అన్నారు కదా అని మహిళల సహనాన్ని అలుసుగా తీసుకుంటే, ఈ ప్రభుత్వం వారి నుంచి గుణపాఠం నేర్చుకోక తప్పదు. స్త్రీ మూర్తులందరూ ధైర్యంగా ఉండండి. మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంది. అంతిమ విజేతలు మీరే. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.

https://twitter.com/ncbn/status/1236478197417390080?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1236478197417390080&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-680512%2Fchandrababu-fires-on-ap-govt

0/Post a Comment/Comments

Previous Post Next Post