తమ బిడ్డను దారుణాతి దారుణంగా హత్య చేసిన దోషులకు సరైన శిక్ష పడలేదని, తద్వారా తమకు న్యాయం జరగలేదని వ్యాఖ్యానించిన నిర్భయ తల్లి ఆశా దేవి, హైదరాబాద్ లో హత్యాచారానికి గురైన దిశ, తల్లిదండ్రులకు మాత్రం సత్వర న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. “హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ హత్యాచారం అత్యంత దారుణం. మా బిడ్డ విషయంలో మేము ఏడేళ్లుగా పోరాడుతూనే ఉన్నాము. కానీ, దిశ విషయంలో న్యాయం త్వరితగతిన జరుగుతుంది. నాటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి” అని దిశ తల్లిదండ్రులను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. కాగా, న్యూఢిల్లీ వీధుల్లో నడుస్తున్న బస్సులో ఆశాదేవి కుమార్తె (23)ను ఆరుగురు దారుణాతి దారుణంగా అత్యాచారం చేశారు. 2012 డిసెంబర్ 16 అర్థరాత్రి నుంచి 17 తెల్లవారుజాము వరకూ ఈ దారుణం జరుగగా, 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాధితురాలు కన్నుమూసింది. దేశ యువతలో వెల్లువెత్తిన నిరసనతో చట్టాలు కఠినమయ్యాయి. కొత్తగా నిర్భయ చట్టం వచ్చిందన్న సంగతి కూడా తెలిసిందే. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష పడగా, ఓ నిందితుడు పెట్టుకున్న క్షమాభిక్షను అంగీకరించ వద్దని ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సిఫార్సు చేసింది. ఈ కామాంధుడికి సమాజంలో బతికే అర్హత లేదని అభిప్రాయపడింది.
Post a Comment