టెస్లా కంపెనీ అధినేతగా సుపరిచితుడైన ఎలాన్ మస్క్ కు ఇటీవల దారుణ పరాభవం ఎదురైంది. ఆయన మానసపుత్రికగా పేరున్న సైబర్ ట్రక్ అనే వాహనం రూపంలో ఆయన పేరుప్రతిష్ఠలకు భంగం కలగడమే కాదు, ఆర్థికంగానూ పెద్ద దెబ్బే తగిలింది. అసలేం జరిగిందంటే, కొన్నిరోజుల క్రితం సైబర్ ట్రక్ ఆవిష్కరణ కార్యక్రమంలో దాని దృఢత్వం గురించి ఎలాన్ మస్క్ ఎంతో గొప్పగా చెప్పారు. ఇనుప సమ్మెటతో బాదినా దానికేం కాదన్నారు. అంతేకాదు ఓ గొడ్డలి తెమ్మని చెప్పి దాంతో సైబర్ ట్రక్ తలుపును బలంగా మోదారు. నిజంగానే దానికేం కాలేదు. విజయగర్వంతో అందరివైపు చూసిన మస్క్ ఈసారి కొన్ని ఇనుప గుళ్లు తెప్పించి వాటితో వాహనం అద్దాలను కొట్టమని చెప్పారు. దురదృష్టం కొద్దీ ఆ ఇనుపగుండు తగలడంతో వాహనం అద్దం భళ్లున పగిలిపోయింది. మరోసారి కొట్టినా అదే ఫలితం వచ్చింది. ఎలాన్ మస్క్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. నెక్ట్స్ జనరేషన్ వాహనంగా ఎంతో గొప్పపేరు తెచ్చుకుంటుందనుకున్న ఆ సైబర్ ట్రక్ ఆవిష్కరణ ఆ విధంగా తుస్సుమనడంతో మస్క్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ తతంగం టెలివిజన్ లో ప్రత్యక్షప్రసారం కావడంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ చూశారు. దీని ప్రభావం కాస్తా టెస్లా షేరు వాల్యూపైనా పడింది. ఒక్కసారిగా టెస్లా షేరు విలువ ఆరు శాతం తగ్గిపోయింది. దాంతో ఒక్కరోజులోనే ఎలాన్ మస్క్ సంపదలో రూ.5500 కోట్లు కోతపడింది. ఇదంతా కేవలం ఒక అద్దం చేసిన పని!
Post a Comment