సంగారెడ్డి: జిల్లాలో బొలెరో వాహన డ్రైవర్‌పై అమానుషంగా ప్రవర్తించారు పోలీసులు. బూటు కాలితో తంతు.. లాఠీలతో చితకబాదారు. లబోదిబోమని మొత్తుకుంటున్నా వినకుండా ఇష్టం ఉన్నట్లు కొట్టారు. ఇంతకు ఆ డ్రైవర్ చేసిన పాపం ఏంటో తెలుసా.. పోలీసులు వాహనం ఆపమనగానే ఆపకుండా.. కాస్తా ముందుకు వెళ్ళి ఆపడం. దానికే రెచ్చిపోయిన సదాశివపేట పోలీసులు ఆ అమాయకునిపై తమ ప్రతాపం చూపారు. ఆ వివరాలు.. సదాశివపేటకు చెందిన వాజిద్ బొలేరో వాహనం నడుపుతుంటాడు. సింగూరుకు కిరాయికి వెళ్తుండగా అయ్యప్ప స్వామి గుడి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రధాన రహదారిపై సడెన్‌గా పోలీసులు రావడంతో వాహనాన్ని కాస్తా దూరంగా తీసుకెళ్లి ఆపాడు వాజిద్. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కానిస్టేబుల్ అతని చేతిలో ఉన్న లాఠీతో చితకబాదాడు. అక్కడితో ఆగకుండా బూటు కాలితో తంతూ.. బండ బూతులు తిట్టాడు. పోలీసుల దాడిలో వాజిద్‌కి గాయాలయ్యాయి. ఓవైపు రాష్ట్రంలో ప్రైండ్లీ పోలీస్ అని పోలీసు ఉన్నతాధికారులు చెబుతుంటే... కింది స్థాయిలో అమలు కాకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Post a Comment