హైదరాబాద్: పోలీసు పదోన్నతులకు మార్గం సుగమం అయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం డీఎస్పీ స్థాయిలో 122 అడహాక్(తాత్కాలిక) పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తద్వారా రెండేళ్లుగా నడుస్తున్న వివాదానికి చెక్‌పెట్టి మిగతా ప్రభుత్వ విభాగాల మాదిరిగానే పోలీసుశాఖలోనూ పదోన్నతుల వ్యవహారాన్ని కొలిక్కి తేవాలని భావిస్తోంది. అంతా సజావుగా సాగితే కొద్దిరోజుల్లోనే పదోన్నతుల ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.సీనియారిటీలో తమకంటే వెనుక ఉన్న హైదరాబాద్ రేంజికి చెందిన 1996 బ్యాచ్ సీఐల కంటే తమకే ముందు పదోన్నతులు ఇవ్వాలని వరంగల్ రేంజికి చెందిన 1995 బ్యాచ్ సీఐలు డిమాండు చేస్తున్నారు. కానీ హైదరాబాద్ రేంజిలో ఉన్న ఖాళీలకు అనుగుణంగా పదోన్నతులు త్వరగా రావడంతో సీనియార్టీ జాబితాలో వారే ముందున్నారని అధికారులు చెబుతున్నారు. తమకంటే జూనియర్లకు ముందు ఎలా పదోన్నతులు ఇస్తారని, ఇప్పటికే తమ బ్యాచ్‌కే (1995) చెందిన హైదరాబాద్ రేంజి సీఐలు డీఎస్పీలయ్యారని, ఇది ఎంతవరకూ సమంజసమని వరంగల్ రేంజి సీఐలు ప్రశ్నిస్తున్నారు. దీన్ని చక్కదిద్దాలంటూ వీరంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం విజ్ఞప్తి చేశారు. 1995 బ్యాచ్‌లోని 54 మంది సీఐలు, 1996 బ్యాచ్‌లోని 64 మంది సీఐలు, సాయుధ విభాగం నుంచి వచ్చిన 13 మంది, మరికొందరు సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. ఇన్ని పోస్టులు లేకపోవడంతో సమస్య మొదలైంది. ఇప్పుడు డీఎస్పీ స్థాయిలో 122 అడహాక్ పోస్టుల ఏర్పాటుతో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. అలాగే డీఎస్పీ స్థాయిలో ఎక్కువ ఖాళీలను సృష్టించేందుకు వీలుగా.. 35 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా, 22 మంది అదనపు ఎస్పీలకు నాన్‌క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతులు ఇవ్వబోతున్నారు.
Post a Comment