హైదరాబాద్: గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా ఇండస్ వివా పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా రూ.1500 కోట్ల మేర వసూలు చేసినట్లు గుర్తించారు. అరెస్టయిన వారిలో తెలంగాణకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండటం గమనార్హం. గొలుసుకట్టు మోసం, అరెస్టు వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ వివరించారు. బెంగళూరుకు చెందిన అభిలాష్ థామస్, ప్రేమ్‌కుమార్ సహా మరికొంత మంది ముఠాగా ఏర్పడి బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ పేరుతో గొలుసుకట్టు వ్యాపారాన్ని ప్రారంభించారు.తమ సంస్థలో రూ.12,500లతో సభ్యత్వం తీసుకొని ఇతరులను చేర్చితే లాభాలు గడిస్తారని ప్రజలను నమ్మిస్తారు. ఇలా వారు 10 లక్షల మందిని మోసగించి రూ.1500 కోట్ల మేర వసూలు చేశారు. పది రోజుల క్రితం ఇండస్ వివాపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో దర్యాప్తు ప్రారంభించి ఈ ముఠాను అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. నిందితులకు చెందిన పలు అకౌంట్లలోని రూ.20 కోట్లను జప్తు చేసినట్లు తెలిపారు. అరెస్టయినవారిలో తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, వారి భార్యలు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు ఉపాధ్యాయులు తమ విధులకు సెలవు తీసుకొని మరీ ఈ మోసాలకు పాల్పడ్డట్లు సీపీ వివరించారు. సంస్థ సీఈఓ సహా మొత్తం 24 మందిని అరెస్టు చేశామని, ఛైర్మన్ పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు.
Post a Comment