హర్యానా స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ...డిప్యూటీ సీఎం, హోమ్ మంత్రి ఇలాకాల్లో ఓటమి

 


హర్యానాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీకి ప్రతికూలంగా మారింది. సోనిపట్, అంబాలా మునిసిపల్ స్థానాలను బీజేపీ కోల్పోయింది. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు విడుదల కాగా, హిస్సార్ జిల్లా ఉకలానా, రేవారీ పరిధిలోని ధారూహెరాలను బీజేపీ కోల్పోయింది. ఈ రెండు స్థానాలూ ఇన్నాళ్లూ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కంచుకోటలుగా ఉంటూ వచ్చాయి. ప్రస్తుతం హర్యానాలో బీజేపీ - జేజేపీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉండగా, గత కొన్ని వారాలుగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, రైతులు తీవ్ర ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు హర్యానా సరిహద్దుల్లో నిరసనలు చేస్తుండగా, వారికి స్థానిక రైతుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఈ ప్రభావమే ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. హోమ్ మంత్రి అనిల్ విజ్ సొంత నియోజకవర్గమైన అంబాలాలో బీజేపీ ఓటమి ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక బీజేపీ ఓటమి పాలైందని తెలిసిన అనంతరం ధర్నాల్లో ఉన్న రైతులు మిఠాయిలు పంచుకుని, ఆనందంతో పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. అంబాలాలో హర్యానా జనచేతన పార్టీకి చెందిన శక్తి శర్మ మేయర్ కాబోతున్నారు. సోనిపట్ లో కాంగ్రెస్ కు చెందిన లలిత్ బాత్రా మేయర్ పదవిని అలంకరించనున్నారు. "సోనిపట్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ప్రస్తుతం రైతులు నిరసనలు తెలుపుతున్న సింఘూ సరిహద్దుల పక్కనే ఇది ఉందన్న సంగతి తెలిసిందే" అని పార్టీ నేత శ్రీవాత్సవ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో పంచకుల మేయర్ పదవి మాత్రం బీజేపీకే దక్కింది. ఇక్కడ కుల్ భూషణ్ గోయల్ విజయం సాధించారు. మొత్తం ఏడు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అంబాలాలో 20 సీట్లకు గాను అధికార బీజేపీ 8 స్థానాలను మాత్రమే గెలవడం గమనార్హం. 

0/Post a Comment/Comments

Previous Post Next Post