- కాపలా కుక్క కాదు. కరిసే కుక్క.
- రాష్ట్రంలో నెంబర్ వన్ మోసకారి కేసీఆర్.
- భద్రాద్రి రాముని సైతం మోసం చేసిన ఘనుడు.
- దుబ్బాక ఫలితాలే పునరావృత్తం అవుతాయి.
- పట్టభద్రులరా ఒక్కసారి అవకాశం ఇవ్వండి.
-ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం:
నవంబర్ ఒకటిన జనగామలో మొదలైన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పాదయాత్ర సోమవారం సాయంత్రం భద్రాచలం చేరింది.
ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న మంగళవారం ఉదయం భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు నిరంతరం ఉద్యమాలను చేయడం ద్వారా, అనేక మంది ప్రాణాల బలిధానాల వలన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కాస్త దొంగల పాలయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 16 వేల కోట్ల మిగులు నిధులతో కళకళలాడుతూ ఉండేదని, కెసిఆర్ అధికారంలోకి వచ్చిన ఏడు సంవత్సరాలలోనే 4 లక్షల కోట్ల అప్పులు చేసిన గొప్ప రాష్ట్రంగా తయారైందని, తెలంగాణ రాష్ట్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకం అనే నినాదంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న కేసీఆర్ ఉద్యోగాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తన కూతురు కల్వకుంట్ల కవిత మాత్రం ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చి సంతోషపరచడం మూర్ఖత్వం అన్నారు. ఏ కార్పొరేషన్ నిధులు కూడా విడుదల చేయకుండా ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను తుంగలో తొక్కుతున్నారని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించి తన జేబులు నింపుకునే కాలేశ్వరం ప్రాజెక్టుకు మళ్ళించి నిరుద్యోగ యువత భవిష్యత్తు తో ఆడుకుంటున్నాడని దుయ్యబట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగ యువత ఉద్యోగాలు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు, ఒంటెద్దు పోకడలకు చెంపపెట్టులాంటిదని ఆయన అన్నారు. దుబ్బాక ఎన్నికల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం పతనం మొదలైందని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు కావాలని కొట్లాడుతున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించవలసింది పోయి ఫీల్డ్ అసిస్టెంట్ లను, ఉపాధి హామీ, సాక్షర భారత్, మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్ లను ఇతర అనేకమంది వేలాది ఉద్యోగాలను తొలగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కాపలా కుక్కలా గా ఉంటానన్న కేసీఆర్ కరిసే కుక్కలా తయారయ్యాడని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రజలను మోసం చేయడమే కాకుండా సాక్షాత్తు భద్రాద్రి రామయ్యను సైతం వంచించాడని, రామాలయం అభివృద్ధి కొరకు సంవత్సరానికి 100 కోట్లు ఇస్తానని ప్రగల్భాలు పలికి, కనీసం వంద రూపాయలు కూడా ఇవ్వకుండా మోసం చేశాడని ఆయన తెలిపారు. అనేక తరాల నుండి భద్రాద్రి రాములవారి కల్యాణానికి ప్రభుత్వమే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురావడం ఆనవాయితీగా మారిందని, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భద్రాచలం ప్రాంతం వైపు చూసేందుకు కూడా ఇష్టపడకుండా భద్రాద్రి రామయ్య కళ్యాణానికి రాకుండా, తన మనవడితో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు పంపించడం భద్రాద్రి రామయ్యను అవమానపరచడం కాదా అని ఆయన ప్రశ్నించారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో అనేక సమస్యలు నెలకొన్నాయని ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆకాంక్షలను వారి సమస్యలను తీర్చాల్సిన ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తూ, అన్యాయానికి గురి చేస్తుండటం మూర్ఖత్వమని అన్నారు. వందల సంవత్సరాల క్రితం నిర్మించిన భద్రాచలం ఆలయం చెక్కుచెదరకుండా ఉంటే, కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణ దశలోనే కూలి పోతుండడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. స్థానిక ఐటిసి పేపర్ బోర్డ్ కర్మాగారంలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఉద్యోగస్తులుగా నియమించడం సరికాదని, అసలు భద్రాచలం ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉందా అనే అనుమానం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అతిపెద్ద ఐ టి డి ఏ భద్రాచలంలోనే ఉన్న ఇక్కడ ఉన్న ఆదివాసీలకు, గిరిజనులకు ఎటువంటి ఉపయోగం లేకుండా ఉండడం బాధాకరమని ఆయన అన్నారు. పోలవరం ముంపు పేరుతో ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపి చోద్యం చూస్తున్నారని, లక్షలాది మంది ఆదివాసీలు ఇతర ప్రజలు పోలవరం ముంపు వలన జల సమాధి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం పట్టణ పరిస్థితి దీవి లా తయారైందని, భద్రాచలానికి భూభాగం లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు, నిర్మాణాలు చేపట్టాలనా, కనీసం పట్టణ ప్రజలు చెత్త వేసుకునేందుకు డంపింగ్ యార్డు కూడా లేని దుస్థితి భద్రాచలం పట్టణంలో నెలకొందన్నారు. తెలంగాణ ఏర్పడితే గిరిజన యూనివర్సిటీని నెలకొల్పుతామని ఇచ్చిన హామీలను విస్మరించారని, కేసీఆర్ కు హామీ ఇవ్వడమే కానీ అమలు చేయడం చేతకాదని విమర్శించారు. రానున్న హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికలలో ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి తగు విధంగా బుద్ధి చెప్తారని జోస్యం చెప్పారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న నైన నన్ను గెలిపిస్తే శాసనమండలిలో తీన్మార్ ప్రోగ్రాం చూపిస్తానని, ప్రశ్నించే గొంతుకను ఎన్ను కోవాలని పట్టభద్రులకు సూచించారు. మనకు కావాల్సింది ఫామ్ హౌస్ లో పడుకొనే నాయకత్వం కాదని, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా పోరాడే నాయకుడు కావాలని, ఆవిధంగా పోరాడేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని పట్టభద్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల తరఫున పోరాడేందుకు, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మాత్రమే ఎన్నికలలో పోటీ చేస్తున్నానని, అక్రమ సంపాదన, అక్రమార్జన కోసం కాదని, నేను చనిపోయే ముందు నా ఒంటి మీద బట్టలు తప్ప మరి ఏ ఇతర ఆస్తులు ఉండవని, ఇలా దేశంలో ప్రకటించిన ఏకైక వ్యక్తిని తానేనని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను సాధ్యమైనంతవరకు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఒక అవకాశం ఇవ్వాలని పట్టభద్రులను కోరారు.
Post a Comment