భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం:చర్ల మండలంలో ఐదుగురు మావోయిస్టు కొరియర్లను పట్టుకున్నట్టు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసిన భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర IPS. ఏఎస్పీ కార్యాలయం నుండి వచ్చిన సమాచారం ప్రకారం నవంబర్ 02, సోమవారం మధ్యాహ్నం చర్ల SI, తన సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు, 141 ఎ సిఆర్‌పిఎఫ్ సిబ్బందితో కలిసి చర్ల పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా చర్ల గాంధీ బొమ్మ సెంటర్ నుండి పుసుగుప్పకూ వెళ్లే రహదారి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురు వ్యక్తులను పట్టుకుని విచారించగా వారు చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన కోరం జోగా, పొడియం జోగా, బాడిస లక్ష్మా, సోడి లక్మ ,కొర్స సురేశ్ లుగా ప్రాధమిక దర్యాప్తులో నిర్ధారణ అయిందని, వారిని విచారించగా వారు గత నాలుగు సంవత్సరాలుగా నిషేధిత సిపిఐ మావోయిస్టు జేగురుగొండ ఏరియా కమిటీ జగదీష్, నాగమణి అనే మావోయిస్టు సభ్యులకు కొరియర్లుగా, సానుభూతిపరులుగా ఉంటూ లోకల్ మిలీసియా సబ్యులుగా పనిచేస్తున్నారని వెల్లడైంది. వారు ఐదుగురు నిషేధిత సిపిఐ మావోయిస్టు సభ్యుల ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణం నుండి మావోయిస్టు పార్టీ యూనిఫామ్ క్లాత్ కొనుక్కొని తిరిగి వెళ్తుండగా చర్లలోని గాంధీ బొమ్మ సెంటర్ నందు చర్ల పోలీసులు పట్టుకోవడం జరిగిందనీ, వీరి వద్ద నుండి 20 మీటర్ల ఆలివ్ గ్రీన్ క్లాత్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు. నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు పూర్తిగా అమాయకులైన ఛత్తీస్గఢ్ రాష్ట్ర గిరిజనులను తెలంగాణ ప్రాంతానికి పంపిస్తూ వారితో పార్టీ కి అవసరమైన వస్తు సామాగ్రిని, ప్రేలుడు పదార్దాలను తెప్పించుకుంటూ వారికి అవసరమైన పనులను చేయించుకుంటున్నాయని, అదేవిధంగా తెలంగాణ మావోయిస్ట్ స్టేట్ కమిటీ మరియు బటాలియన్లు యాక్షన్ టీమ్లను, రెక్కి టీమ్లను తెలంగాణ లోకి పంపిస్తూ పోలీసు వారి కదలికలను గమనించి పలు హింసాత్మక చర్యలు సృస్టించి ప్రజలని భయాందోళనకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నరని అయన చెప్పారు. ప్రజలు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులకు సహకరించవద్దని వారికి ఎటువంటి వస్తువులను సరఫరా చేయవద్దని పోలీసుశాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర IPS తెలిపారు.
Post a Comment