కేంద్రం విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితా ... అందులో ఒకరు హైదరాబాద్ వాసి

 


కేంద్ర  హోం మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించిన 18 మంది ఉగ్రవాదుల జాబితాలో హైదరాబాద్‌, మాదన్నపేట సమీపంలోని కుర్మగూడకు చెందిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్ పేరును కూడా చేర్చింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) సానుభూతి పరుడైన ఫర్హతుల్లా 1998లోనే ఉగ్రవాదం వైపు ఆకర్షితుడైనట్టు పోలీసులు తెలిపారు. తొలుత దుబాయ్ పారిపోయి అక్కడి నుంచి ఉగ్రకార్యకలాపాలు ప్రారంభించిన ఫర్హతుల్లా ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి పనిచేస్తున్నాడు. గుజరాత్‌లోని అక్షరధామ్‌ ఆలయంపై 2002లో జరిగిన దాడితో అతడి పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది. 2004లో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర పన్నినప్పటికీ పోలీసులు ఛేదించారు.  2005లో హైదరాబాద్ గ్రీన్‌ల్యాండ్స్ సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడిలోనూ ఘోరీ నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)లో పనిచేస్తున్న ఫర్హతుల్లా ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుల్లో ఒకడైన అమీర్ రాజాకు అత్యంత సన్నిహితుడు. కాగా, నిన్న కేంద్రం ప్రకటించిన 18 మంది ఉగ్రవాదుల జాబితాలో లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులైన కర్ణాటకకు చెందిన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పేర్లు కూడా ఉన్నాయి. వీరిలో యాసిన్ భత్కల్‌కు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.

0/Post a Comment/Comments

Previous Post Next Post