ఒక్క పైసా కూడా ఎవరికీ ఇవ్వొద్దు: కేటీఆర్

 


రాష్ట్రంలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉదేశంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు. ఆస్తుల నమోదు విషయంలో దళారులను నమ్మొద్దని, ఎవరికీ ఒక్కపైసా కూడా ఇవ్వొద్దని చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందని అన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో గ్రేటర్ పరిధిలోని రెవెన్యూ సమస్యలపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈమేరకు వివరణ ఇచ్చారు. హైదరాబాదులో సుమారు 24.50 లక్షల ఆస్తులు ఉన్నట్టు అంచనా వేశామని కేటీఆర్ తెలిపారు. ప్రజలంతా నిశ్చింతగా వారి ఆస్తిపై హక్కులను పొందేలా చేయడమే తమ ప్రయత్నమని చెప్పారు. భవిష్యత్తులో ఆస్తుల క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు. సామాన్యుడికి కొత్త రెవెన్యూ చట్టం అండగా ఉంటుందని, అవినీతికి పాతర వేస్తూ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని అన్నారు. రానున్న రోజుల్లో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ద్వారానే జరుగుతాయని చెప్పారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు వేర్వేరు రంగుల్లో పాసుపుస్తకాలను ఇస్తామని తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post