చైనా సముద్రంలోకి అమెరికా యుద్ధ నౌకలు



ఇటీవల హిందూ మహాసముద్రంలోకి చైనా 6 యుద్ధ నౌకలను పంపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై భారత నౌకాదళం దీటుగా స్పందిస్తుండగా అమెరికా కూడా దక్షిణ చైనా సముద్రంలోకి యుద్ధ నౌకలను తరలించింది. దక్షిణ చైనా సముద్రం అంశంపై చైనా పొరుగు దేశాలను బెదిరిస్తోందని అగ్ర రాజ్యం మండిపడింది. అమెరికా తీసుకుంటోన్న చర్యలు, చేస్తోన్న వ్యాఖ్యలపై చైనా స్పందిస్తూ అభ్యంతరాలు తెలిపింది. దక్షిణ చైనా సముద్రం అంశంపై అమెరికా చేస్తోన్న ఆరోపణలు సరికాదని అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటన చేసింది. ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించింది. ఇందులో అమెరికాకు సంబంధం లేదని, ఇందులో జోక్యం చేసుకోవడం సరికాదని తెలిపింది. స్థిరత్వం కాపాడాలన్న వంకతో అమెరికా ఉద్రిక్తతలు తలెత్తేలా వ్యవహరిస్తోందని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వల్లో 90 శాతం తమకే చెందుతాయని చైనా మొదటి నుంచి వాదిస్తోంది. అయితే, దీనిపై  పలు దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం యుద్ధ విన్యాసాలకు ప్రణాళికలు వేసుకుంటోంది. ఇటీవల దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌... ఆ ప్రాంతంలో శాంతిభద్రతలకు కట్టుబడి ఉంటామని తమ భాగస్వాములకు తెలియజేసేందుకే తాము నౌకాదళ విన్యాసాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
Previous Post Next Post