నరేంద్ర మోదీ... లడఖ్ ఆకస్మిక పర్యటన



ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం లడఖ్ లోని సరిహద్దులకు వెళ్లారు. ప్రధాని షెడ్యూల్ లో లేని ఈ పర్యటనకు ముందుగానే రహస్యంగా ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తుండగా, ఆయన వెంట త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు. వీరు ఇరువురూ సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడుతూ దేశాన్ని కాపాడుతున్న సైనికుల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు లడఖ్ లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.శుక్రవారం ఉదయం లడఖ్ కు మోదీ వచ్చారని అక్కడి మీడియా వెల్లడించేంత వరకూ విషయం బయటకు రాకపోవడం గమనార్హం. మోదీ వెంట సైన్యాధిపతి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన లేహ్ లో పర్యటిస్తున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అకస్మాత్తుగా మోదీ ఈ పర్యటన జరపడం గమనార్హం. ఈ వీడియోల్లో మోదీ కూడా సైనిక దుస్తుల్లో కనిపిస్తున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సైనికులకు సెల్యూట్ చేసి, వారి భుజాలు తడుతూ అభినందించారు. కరోనా భయాలను పక్కనబెట్టి, జవాన్లతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా జవాన్లంతా జై హింద్ అని నినాదాలు చేస్తుంటే, మోదీ కూడా వారితో కలిసి భరతమాతకు జైకొట్టారు. వాస్తవానికి నేడు రాజ్ నాథ్ సింగ్ లడఖ్ వెళతారని రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. అయితే, రాజ్ నాథ్ స్థానంలో ప్రధానే స్వయంగా వెళ్లి, సైనికుల్లో ధైర్యాన్ని నింపాలని నిర్ణయించుకున్న మీదటే, ఆయన పర్యటనకు ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది. భారత్ శాంతికాముక దేశమని, ఇదే సమయంలో ఎవరైనా దురాక్రమణకు దిగితే మాత్రం ఏ మాత్రమూ జాలి, దయ వద్దని మోదీ ఈ సందర్భంగా సరిహద్దు జవాన్లకు సూచించినట్టు సమాచారం.

Previous Post Next Post