చైనా మార్షల్ ఆర్ట్స్ యోధులకు దీటుగా.. భయంకర 'ఘాతక్' కమాండోలను పంపిన భారత్



గాల్వాన్‌ లోయలో భారత సైనికులపై చైనా పీపుల్స్ ఆర్మీ దాడికి పాల్పడే ముందు రోజు, మార్షల్‌ ఆర్ట్స్ యోధులు, పర్వతారోహకులను పంపిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో, చైనాకు దీటుగా సమాధానం ఇచ్చేందుకు భారత ప్రభుత్వం‌ 'ఘాతక్'‌ కమాండోలను రంగంలోకి దింపింది. 20 మంది మార్షల్ ఆర్ట్స్ యోధులను టిబెట్ రాజధాని లాసాకు పంపిన చైనా, వారితో సైనికులకు శిక్షణ ఇప్పించిందని ఆ దేశ అధికార మిలటరీ పత్రిక స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత సైన్యం తన ప్రాణాంతక కమాండోలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.ఇక, ఈ కమాండోలను కర్ణాటకలోని బెల్గాం పట్టణ శివారులో ఉన్న ఓ ప్రత్యేక శిబిరంలో తర్ఫీదు చేస్తారు. మెరికల్లాంటి సైనికులను ఎంపిక చేసుకుని, వారికి అత్యంత కఠిన శిక్షణ ఇస్తారు. 35 కిలోల వరకూ బరువును సునాయాసంగా ఎత్తడం, 40 కిలోమీటర్ల దూరం వరకూ ఆగకుండా నడవడంతో పాటు శారీరకంగానూ వీరు అత్యంత బలాడ్యులుగా ఉంటారు. ప్రత్యేక ఆయుధాల శిక్షణ, పోరాట శిక్షణ వీరి సొంతం. ప్రతి ఒక్కరికీ మార్షల్స్ ఆర్ట్స్ లో కూడా ప్రవేశం ఉంటుంది. చేతిలో ఎలాంటి ఆయుధం లేకపోయినా, ప్రాణాలకు తెగించి పోరాడటంలో దిట్టలు. వీరికి యుద్ధ విమానాలు నడపడంలోనూ శిక్షణ ఇస్తారు. శత్రువుల విమాన స్థావరాలు, మందుగుండు స్థావరాలు, డంపింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడికే వెళ్లి ప్రత్యక్ష దాడులు చేస్తారు. పలు రకాల యుద్ధకళల్లోనూ వీరికి ముందుగానే శిక్షణ ఇచ్చి వుండటంతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా వెనుకంజ వేయరు. పర్వత ప్రాంతాలలో దాడులనూ చేయగల సమర్థులు. సాధారణంగా ఒక 'ఘాతక్' ప్లాటూన్ ‌లో 22 మంది కమాండోలు ఉంటారు. ఒక కమాండింగ్ కెప్టెన్, ఇద్దరు నాన్ - కమిషన్డ్ ఆఫీసర్లు, మార్క్స్ మాన్, స్పాటర్ జోడీలు, లైట్ మెషిన్ గన్నర్స్, మెడిసిన్, రేడియో ఆపరేటర్ వంటి వారితో ఈ టీమ్ నిండివుంటుంది. వీరి వద్ద టార్-21, ఇన్సాస్, ఏకే-47 వంటి ఆయుధాలతో పాటు డ్రాగునోవ్ ఎస్వీడి రైఫిల్స్, హెక్లర్ క్లోచ్ వెపన్స్ ఉంటాయి. తాము చేపట్టబోయే ఆపరేషన్ కు అనుగుణంగా ఎటువంటి ఇతర పరికరాలనైనా వినియోగిస్తారు. గ్రెనేడ్లు, రాకెట్ లాంచర్లు, నైట్ విజన్ కెమెరాలను వాడటంలోనూ నేర్పుతో ఉంటారు. ఇక ఒకసారి ఘాతక్ కమాండోలు దాడి చేస్తే, అది చాలా అనూహ్యంగా ఉంటుంది. శత్రువులు కోలుకునేందుకు కూడా సమయం ఉండదు. తాము ఎంచుకున్న యూనిట్ పై అకస్మాత్తుగా దాడి చేసి, పక్కవారి ప్రాణాలు తీసి, అనుకున్నది సాధించే వరకూ నిద్రపోరు. 1996లో భారత్, చైనా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, చైనా సరిహద్దుల్లోని ఎల్ఏసీ ప్రాంతంలో రెండు కిలోమీటర్ల పరిధి వరకూ ఎటువంటి ఆయుధాలు వినియోగించేందుకు వీల్లేని పరిస్థితుల్లో ఘాతక్ కమాండోల అవసరం ఆ ప్రాంతంలో ఉందని భావించిన కేంద్రం, ఇప్పుడు వారిని అక్కడికి తరలించిందని తెలుస్తోంది.
Previous Post Next Post