మేకను చంపినందుకు బదులుగా మేక ఇవ్వాలని పెద్దలు చెప్పినా పట్టించుకోవడంలేదన్న కక్షతో బంధుత్వాన్ని కూడా మర్చి బావను హత్య చేశాడో బావమరిది. పొలం పనికి వెళ్లి మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కత్తితో నరికి దాడి చేశారు. తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ నాగలోవ గ్రామం (కొండరెడ్ల గ్రామం) నిన్న వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ఇలావుంది. గ్రామానికి చెందిన బలిజ బాలయ్య (45), సాల బొబ్బిలిరెడ్డి బావబావ మరుదులు. బొబ్బిలిరెడ్డికి చెందిన మేక తరచూ బాలయ్య పొలంలో పడి మేసేస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా బొబ్బిలి రెడ్డి పట్టించుకోవడం లేదన్న కోపంతో ఓ రోజు బాలయ్య ఆ మేకను చంపేశాడు. దీంతో బొబ్బిలిరెడ్డి పంచాయతీ పెట్టించాడు. గ్రామ పెద్దలు మేకకు బదులు మేక పది హేను రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు.
అయితే ఎప్పటికీ మేక ఇవ్వక పోవడంతో బుధవారం పొలంలో ఉన్న బాలయ్య వద్దకు తన అనుచరులతో బొబ్బిలిరెడ్డి వచ్చి నిలదీశాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరగడంతో తనతోపాటు తెచ్చిన కత్తితో తలపై నరకడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న బాలయ్య భార్య బుల్లెమ్మ 25 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Post a Comment