ఈరోజు ఉదయం మాచర్ల వెళ్తున్న విషయాన్ని నిన్ననే అక్కడి పోలీస్ స్టేషన్ కు ముందస్తు సమాచారం ఇచ్చామని అన్నారు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా అందరూ కలిసి గూడుపుఠాణిగా ఏర్పడ్డారని ఆరోపించారు. కారంపూడి నుంచి తమను అనుసరించారని, మాచర్ల టౌన్ లోకి ప్రవేశించగానే దాడి చేశారని ఆరోపించారు. అయితే, తమ కారు కన్నా ముందుగా తమ అడ్వకేట్స్ ఉన్న కారు వెళ్లిందని, ఆ కారులో తాము ఉన్నామని భావించి దానిని ఆపారని, ఈలోగా వెనక నుంచి రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో కారులో ఉన్న అడ్వకేట్ కు తీవ్రగాయాలు అయ్యాయని చెప్పారు.దాడి చేసిన కారులో తాము లేమని తెలుసుకున్న వ్యక్తులు ఆ వెనకాలే ఉన్న కారు వద్దకు వచ్చారని, ముప్పై మంది వ్యక్తులు కారును చుట్టుముట్టి, వారి ఇష్టానుసారం కారును ధ్వంసం చేశారని, లోపల ఉన్న తమపైనా దాడులు జరిగాయని, ఇందుకు నిదర్శనం ‘ఈ బ్లడ్’ అంటూ తాను ధరించిన చొక్కాపై ఉన్న రక్తపు మరకను చూపించారు.
మా కారు డ్రైవరే మమ్మల్ని కాపాడాడు
ఈ ఘటన నుంచి మమ్మల్ని కాపాడింది తమ కారు డ్రైవర్ ‘ఏసు’ అని, ఏసుక్రీస్తులా వచ్చి కాపాడాడని తనకు తోచిందని, చాలా చాకచక్యంగా వాహనం నడిపాడని బోండా ఉమ అన్నారు. అయితే, తమ వాహనం ముందుకు వెళ్లిన తర్వాత కూడా ముప్పై స్కూటర్లపై తమను వెంబడించారని ఆరోపించారు. తమ వాహనంపై దాడికి పాల్పడుతున్న వారిని ముందు సీట్లో కూర్చున్న ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గన్ మెన్ అడ్డుకునే యత్నం చేశారని, తన చేతిలోని ‘గన్’ ని చూపించినా ఫలితం లేకుండా పోయిందని, వాహనానికి ఇరువైపుల నుంచి వచ్చిన తమపై దాడి చేశారని అన్నారు. ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న తమ వాహనంపై మరోమారు దాడికి పాల్పడ్డారని, మాచర్ల టౌన్ దాటి మార్కాపురం వైపు వెళ్లామని, తాము ఎక్కడికి వెళుతున్న సమాచారం ఎప్పటికప్పుడు తమపై దాడులకు పాల్పడ్డ వారికి చేరిందని ఆరోపించారు. మాచర్ల వైసీపీ టౌన్ అధ్యక్షుడు కిశోర్, మరో 30 మంది గూండాలను పెట్టి తమపై దాడి చేశారని ఆరోపించారు.
మమ్మల్ని వెనక్కి తీసుకెళితే చంపేస్తారని చెప్పాం
మాచర్ల నుంచి వెల్దుర్తి వైపు వెళుతుంటే, తమ వాహనాన్ని ఓ పోలీస్ వాహనం ఆపిందని, అందులో డీఎస్పీ, ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారని చెప్పారు. తమను వారి కారులో ఎక్కించుకుని, తమను మళ్లీ వెనక్కి తీసుకువెళ్లబోతుంటే.. ‘మమ్మల్ని వెనక్కి తీసుకెళితే చంపేస్తారు’ అని వాళ్లకు చెప్పామని అన్నారు. దీంతో, తాము కూర్చున్న వాహనం ముందుకు వెళ్లిందని, ఒంగోలు వెళదామనుకున్నామని, వెల్దుర్తి గ్రామం దాటి రెండు కిలోమీటర్లు వెళ్లగానే రోడ్డుపై రెండు వందల మంది గొడ్డళ్లు, కత్తులు, పారలు, పలుగులు వంటి మారణాయుధాలు పట్టుకుని ఉన్నారని అన్నారు.
ఈ మూడు చోట్ల మమ్మల్ని హతమార్చాలని స్కెచ్ వేశారు
తమను హతమార్చడానికి వేసిన మూడు స్కెచ్ లు మిస్సయ్యాయని చెప్పారు. మొదటి స్కెచ్.. మాచర్ల ఎంట్రన్స్ లో, రెండో స్కెచ్.. మాచర్ల సెంటర్ లో, మూడో స్కెచ్.. వెల్దుర్తి దాటిన తర్వాత అని చెప్పారు. వెల్దుర్తి దాటిన తర్వాత తమను హతమార్చాలని వేసిన స్కెచ్ ను సాక్షాత్తూ డీఎస్పీ కూడా చూశారని చెప్పారు. చివరకు, పోలీసులపైనా దాడులు చేశారని ఆరోపించారు. డీఎస్పీ వాహనం అద్దాలను కూడా పగలగొట్టారని, దీంతో, డీఎస్పీ తన రివాల్వర్ బయటకు తీసి వారిని హెచ్చరించి, ఆయన కారులో తమను వెనక్కి పంపించారని చెప్పారు. రెండు నిమిషాల వ్యవధిలో తమ ప్రాణాలు పోవాల్సిందని అన్నారు.
గురజాల డీఎస్పీ ‘దేవుడిలా’ మమ్మల్ని కాపాడారు
మేము ఏం చేశాం? ఎందుకు చంపాలని అనుకున్నారు? మాచర్లలో జరుగుతున్న అరాచకంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాలనుకున్న ప్రతిపక్షపార్టీ అధికార ప్రతినిధులను దారుణంగా హతమార్చాలని ఎందుకు అనుకున్నారు? అని ప్రశ్నించారు. మాచర్లకు వెళుతున్న తమ వాహనం ఒక పిల్లాడిని ఢీ కొట్టినందువల్లే తమ వాహనంపై ఈ దాడి జరిగిందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారని, ఇదంతా అబద్ధమని చెప్పారు. పక్కా వ్యూహంతో టీడీపీ నాయకులను హతమార్చాలని తాడేపల్లిలో స్కెచ్ గీశారని ఆరోపించారు. గురజాల డీఎస్పీ ‘దేవుడిలా‘ తమను కాపాడారని, తాము ప్రయాణిస్తున్న రోడ్డులోకి ఆయన రాకపోతే, మమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడే పరిస్థితి ఉండేది కాదని అన్నారు.
Post a Comment