రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అప్రజాస్వామికంగా వాయిదా వేశారని ఎస్ఈసీ రమేశ్ పై ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ ను కారణంగా చూపిస్తూ ఎన్నికలను వాయిదా వేశారని మండిపడ్డారు. కరోనా గురించి ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించకుండానే వాయిదా వేశారని చెప్పారు. ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేయడంతో పాటు… ఎన్నికల కోడ్ ఈ ఆరు వారాల పాటు అమల్లో ఉంటుందని ఎలక్షన్ కమిషన్ చెప్పడం దారుణమని అన్నారు. ఇంతకాలం పాటు ఎలెక్షన్ కోడ్ అమల్లో ఉంటే పాలన ఎలా సాగుతుందని ప్రశ్నించారు. కిషన్ సింగ్ తోమర్ కేసును ఎలక్షన్ కమిషన్ ఉటంకించిందని… అది ల్యాండ్ మార్క్ కేసే అయినప్పటికీ… దాన్ని ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదని బుగ్గన అన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదని… ఎన్నికలకు కరోనా అడ్డంకి కాబోదని చీఫ్ సెక్రటరీ లేఖ రాసిన తర్వాత కూడా… చీఫ్ సెక్రటరీని ఎలక్షన్ కమిషనర్ పిలిపించి మాట్లాడలేదని చెప్పారు. ఏ ఉద్దేశంతో ఎన్నికలను వాయిదా వేశారో ఎస్ఈసీ చెప్పాలని డిమాండ్ చేశారు.
Post a Comment