పల్నాడు ప్రాంతంలో తిరుగులేని నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంత్రాంగం ఫలించింది. మరే ప్రాంతంలోనూ సాధ్యం కాని విధంగా, మండలంలోని మొత్తం 14 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ స్థానంలో ఇతర పార్టీల అభ్యర్థులు లేకుండా ఆయన చేయగలిగారు. దీంతో అన్ని స్థానాలూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవం అయ్యాయి. మాచర్ల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పిన్నెల్లి, నామినేషన్లు వేసిన ఇతర పార్టీల అభ్యర్థులకు నచ్చజెప్పి, వారితో విత్ డ్రా చేయించారని తెలుస్తోంది. కాగా, కొన్ని వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేసిన తెలుగుదేశం, జనసేన అభ్యర్థులను బెదిరించారని, కొన్ని చోట్ల తమ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళితే, అడ్డుకున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పిన్నెల్లి ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపిస్తున్నారని మండిపడుతున్నారు. గత వారంలో మాచర్లలో తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు బొండా ఉమ తదితరుల వాహన శ్రేణిపై మాచర్లలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ కూడా చేశారు.
Post a Comment