ఐపీఎస్ అధికారిణి ఇంటి ముందు ఐపీఎస్ అధికారి నిరసన!

తన ఇద్దరు బిడ్డలనూ ఒక్కసారైనా చూపించాలని, చూపించే వరకూ తన మాజీ భార్య ఇంటి ముందు నుంచి కదలబోనని బెంగళూరు పోలీస్ అంతర్గత భద్రతా విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న అరుణ్ రంగరాజన్, నిరసనకు దిగారు. ఆయన భార్య కూడా పోలీసు అధికారిణి కావడంతో, ఇద్దరికీ నచ్చజెప్పలేక స్థానిక పోలీసులు మీరే తేల్చుకోవాలంటూ, అక్కడి నుంచి వెళ్లిపోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే. ఛత్తీస్ గఢ్ లో పనిచేస్తున్న సమయంలో అరుణ్ రంగరాజన్ కు డీసీపీ స్థాయి అధికారిణితో పరిచయం ఏర్పడగా, వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఓ బిడ్డ పుట్టిన తరువాత తరచూ బదిలీల సమస్య ఏర్పడటంతో, మనస్పర్థలు పెరిగి, విడాకులు తీసుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ కోర్టు వీరికి 2015లో విడాకులను మంజూరు చేయగా, ఈలోపు వారికి మరో బిడ్డ పుట్టింది. ఇద్దరూ తల్లి దగ్గరే పెరుగుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం, బెంగళూరు, వసంతనగర్ లో ఉంటున్న మాజీ భార్య ఇంటికి చేరుకున్న అరుణ్, పిల్లలను చూపించాలని కోరగా, అందుకామె అంగీకరించలేదు. దీంతో ఇంటి ఎదుటే అరుణ్ నిరసనకు దిగగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మాజీ భర్త వేధిస్తున్నాడని ఆమె కంట్రోల్ రూమ్ కు చెప్పగా, అక్కడికి వచ్చిన స్థానిక పోలీసులు, రంగరాజన్ కు నచ్చజెప్పాలని చూశారు. ఆయన మాత్రం పిల్లల్ని ఒక్కసారైనా చూసేంత వరకూ వెళ్లేది లేదని అక్కడే కూర్చుండిపోయారు. ఈ ఘటన కర్ణాటక పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post