- సన్నాఫ్, డాటరాఫ్, వైఫాఫ్‌లకు స్వస్తి
- సీఏఏ, ఎన్నార్సీల అమలులో భాగమే!
- త్వరలోనే అమల్లోకి
ఆధార్, పాన్‌కార్డులలో ఇక తల్లిదండ్రులు, భర్తల పేర్లు ఉండకపోవచ్చు. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయా కార్డులలో ‘సన్నాఫ్’, ‘వైఫ్ ఆఫ్’, ‘డాటరాఫ్’ అని నమోదు చేసేవారు. ఇప్పుడు వాటిని తొలగించి కొత్తగా ‘కేరాఫ్’ అన్నదానిని తీసుకురావాలని యోచిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, త్వరలోనే ఈ విధానం అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి కొత్తగా ఆయా కార్డులకు దరఖాస్తు చేసే వారు మునుపటిలానే అన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే, కొత్తగా జారీ అయ్యే కార్డుల్లో మాత్రం బంధుత్వానికి సంబంధించిన వివరాలు ఉండవు. అంతేకాదు, ఆధార్, పాన్‌కార్డులలో మార్పుల కోసం దరఖాస్తు చేసుకునే వారి కార్డుల్లోని పాత డేటాను కూడా తొలగించనున్నారు.
ప్రభుత్వ నిర్ణయం వెనక ఉన్న కారణం స్పష్టంగా తెలియనప్పటికీ సీఏఏ, ఎన్నార్సీల అమలుపై పట్టుదలగా ఉన్న ప్రభుత్వం, అందులో భాగంగానే ఈ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై ఆధార్ సంస్థ నుంచి ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు.
Post a Comment