ఆస్తి తనకు దక్కకుండా తల్లి ఎక్కడ చేస్తుందో అన్న ఆందోళనతో ఆమెనే హత్యచేశాడు కొడుకు. పిల్లలు చిన్నప్పుడే భర్త చనిపోయినా కొడుకు, కూతురిని అన్నీ తానై పెంచిన తల్లి చివరికి ఆ కొడుకు చేతిలోనే కన్నుమూసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పెద్దరామదాసు పేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. పలాస సూదికొండ కాలనీకి చెందిన కోతి అనసూయమ్మ (55), తవిటయ్య దంపతులు. వీరికి ఓ కొడుకు, కూతురు. తవిటయ్య చాలా ఏళ్ల క్రితమే చనిపోవడంతో స్థానికంగా చికెన్ సెంటర్ నడుపుతూ బిడ్డలకు అన్నీ తానై పెంచింది అనసూయమ్మ. కూతురిని ఓ అయ్య చేతిలో పెట్టగా, కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడు. సఖ్యత లేకపోవడంతో ఆరేళ్ల క్రితం కోడలు కొడుకును వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో అనసూయమ్మ పలాస వదిలేసి టెక్కలి వచ్చేసింది. రెండేళ్ల క్రితం రామకృష్ణ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెతోనే ఉంటున్నాడు. అనసూయమ్మకు పలాస సూదికొండ కాలనీలో మూడు ఇళ్లున్నాయి. కొడుకు తీరు బాగోక పోవడంతో అనసూయమ్మ ఈ ఇళ్ల బాధ్యతను కోడలు సుహాసినికి అప్పగించింది. దీన్ని సహించలేని రామకృష్ణ తరచూ తల్లితో గొడవపడేవాడు. గత ఏడాది ఆగస్టులో సూదికొండ కాలనీకి వెళ్లి ఇళ్లు తనవని, కనుక అద్దె తనకే ఇవ్వాలని నివాసితులను కోరాడు. ఈ సందర్భంగా రామకృష్ణ భార్య, సుహాసిని బంధువులు అతనిపై దాడి చేయడంతో వెనక్కి వచ్చేశాడు.
అప్పటికి ఆ దాడి విషయాన్ని పట్టించుకోని రామకృష్ణ ఇటీవల భార్య తరపు వారిపై కేసు వేయాలని ఓ న్యాయవాదిని కోరాడు. ఘటన జరిగి చాలా రోజులైనందున ఇప్పుడు కేసు వేసినా నిలబడదని అతను చెప్పాడు. దీంతో అసహనానికి గురైన రామకృష్ణ నిన్న టెక్కలిలోని తల్లి వద్దకు వచ్చి ఆస్తి విషయమై నిలదీశాడు.ఈ సందర్భంగా ఆమె కోడలికి మద్దతుగా మాట్లాడడంతో తట్టుకోలేకపోయాడు. సమీపంలో ఉన్న మంచం కోళ్లలో ఒకదాన్ని విరగ్గొట్టి దానితో తల్లి తలపై బలంగా కొట్టాడు. దీంతో అనసూయమ్మ తలపగిలి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది.అనంతరం బయటకు వెళ్లిపోయిన రామకృష్ణ సాయంత్రం మూడు గంటల సమయంలో వంద నంబరుకు ఫోన్ చేసి జరిగిన ఘటన తెలిపాడు. అనంతరం టెక్కలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
Post a Comment