టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తప్పునే మళ్లీ చేయవద్దని సీఎం జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. పెట్టుబడి అంతా హైదరాబాదులోనే పెట్టి ఒకసారి దెబ్బతిన్నామని ఆయన అన్నారు. ఇప్పుడు విశాఖను పదేళ్లలో హైదరాబాదులా మారుస్తామని జగన్ చెబుతున్నారని… అభివృద్ధి వికేంద్రీకరణ చాలా అవసరమని చెప్పారు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టి…. కేంద్రాన్ని ప్యాకేజీలు, రాయితీలు అడగాలని సూచించారు. అసెంబ్లీ, సచివాలయం వేర్వేరుగా ఉన్న రాజధాని ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.రాజధాని ఎక్కడున్నా పర్వాలేదని… పాలన ఎక్కడి నుంచైనా చేయవచ్చని ఉండవల్లి అన్నారు. జగన్ చెబుతున్నట్టుగా 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశమే లేదని చెప్పారు. పోలవరం పూర్తైతే అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. రాజధాని గొడవలతో జగన్, సీఏఏ గొడవలతో ప్రధాని మోదీ ఇబ్బందుల్లో పడ్డారని చెప్పారు. అర్హులకు సంక్షేమ పథకాలను అందించకపోతే బీభత్సమైపోతుందని చెప్పారు. నీవు ఏసీలో తిరగడం లేదా? మీ అమ్మ ఏసీలో ఉండటం లేదా? అని ఓ వృద్ధురాలు జగన్ ను ప్రశ్నించడాన్ని వాట్సాప్ లో చూశానని తెలిపారు. సంక్షేమ పథకాలకు సంబంధించి అనేక మంది అర్హులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
Post a Comment