కియా తమిళనాడుకు తరలిపోతోందంటూ వార్తలు...స్పందించిన చంద్రబాబు

ఏపీలో ప్రతిష్ఠాత్మక రీతిలో ఉత్పత్తి ప్రారంభించిన అంతర్జాతీయ కార్ల తయారీ దిగ్గజం కియా ఇప్పుడు తమిళనాడు తరలివెళుతోందని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ కథనం వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన దీనిపై మాట్లాడుతూ, కియా అనంతపురం నుంచి తరలి వెళ్లిపోతోందన్న అంశంపై సదరు మీడియా సంస్థ ఎంతో అవగాహనతోనే రాసిందని, దాన్ని వట్టి స్టోరీగా భావించరాదని స్పష్టం చేశారు. అందరితో మాట్లాడిన తర్వాత వారిచ్చిన సమాచారం ఆధారంగా రాసిన కథనం అని వివరించారు. తమిళనాడులో కియా సోదర సంస్థ హ్యుందాయ్ మోటార్స్ యూనిట్ ఉందని, కియా కూడా అక్కడే ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని చంద్రబాబు వెల్లడించారు. అయితే, కియాకు భూములు కేటాయించేందుకు తమిళనాడులో డబ్బులు అడగడంతో ఏపీలో కర్మాగారం స్థాపించే విధంగా ఆ సంస్థను ఒప్పించగలిగామని చెప్పారు. కియా కోసం గుజరాత్, మహారాష్ట్ర కూడా పోటీపడ్డాయని, కానీ కియా ఏపీలో కాలుమోపిందని అన్నారు. రూ.13,500 కోట్ల పెట్టుబడి ఏపీకి వచ్చిందని చంద్రబాబు వివరించారు. మోదీ అంతటివాడు ప్రయత్నించినా కియా ఏపీలోనే యూనిట్ స్థాపించేందుకు మొగ్గుచూపిందని తాజా కథనంలో కూడా పేర్కొన్నారని తెలిపారు. ఏపీలో ఆటోమొబైల్ ఉత్పాదన లేని సమయంలో కియా వచ్చిందని, గతంలో ఫోక్స్ వాగన్ వస్తే ఆ వ్యవహారాన్ని అప్పటి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. ఇప్పుడు తాము ఎంతో కష్టపడి, అనేక ప్రయాసలకోర్చి కియాను తీసుకువస్తే, కియాను ఇబ్బందిపెట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే గత ప్రభుత్వం కల్పించిన రాయితీలు వెనక్కి తీసుకుంటామని హెచ్చరిస్తున్నారని, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సిన ఓ మంత్రి కియాతో రూ.20 వేల కోట్ల భారం పడుతుందని, 20 ఏళ్లలో దానికి ఇచ్చే రాయితీల మొత్తం ఇదని, పారిశ్రామిక ప్రోత్సాహకాలపై తాము సమీక్షిస్తామని అంటారు. ఏపీఐఐసీ చైర్ పర్సన్ తో కలిసి రెండు మూడు నెలల్లో కొత్త విధానం తెస్తామని అంటున్నారు. ఇది దారుణమైన వైఖరి” అంటూ చంద్రబాబు స్పందించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post