అమెరికా : ఇతర దేశాలపై యుద్ధం ప్రకటించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వున్న విశేషాధికారాలను సవరించేందుకు అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధుల సభ శుక్రవారంనాడు తీర్మానాన్ని ఆమోదించింది. ఇక ఈ బిల్లుకు సెనేట్ ఆమోదముద్ర లభిస్తే అధ్యక్షుడి విశేషాధికారాలకు కత్తెర పడటం అనివార్యమవుతుంది. ఇరాన్ విషయంలో ట్రంప్ ప్రదర్శిస్తున్న దుందుడుకు వైఖరిపై ప్రతినిధుల సభలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ సైనికాధికారి ఖాసిం సొలేమానీ హత్యకు ట్రంప్ ఆదేశాలు జారీ చేయటం, హత్యానంతరం ఇరాన్ క్షిపణులతో ప్రతీకార దాడులకు పాల్పడటం వంటి పరిణామాలతో ఇరుదేశాల మధ్య వాతావరణం వేడెక్కి యుద్ధానికి తెరతీసే పరిస్థితులేర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై సైనిక చర్యకు ఆదేశించే అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేయాలని తాము భావిస్తున్నట్లు ప్రకటించిన ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ సూచన మేరకు డెమొక్రాటిక్ పార్టీ సభ్యులు ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో 224 అనుకూలంగానూ, 194 ఓట్లు వ్యతిరేకంగానూ వచ్చాయి. ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయటంతో దీనికి ప్రతినిధుల సభ ఆమోదముద్ర లభించటం సులభసాధ్యమైంది. ఈ తీర్మానం మేరకు కాంగ్రెస్ అనుమతి లేనిదే అధ్యక్షుడు ఇతర దేశాలపై సైనిక చర్యకు ఆదేశించటంపై నిషేధం వర్తిస్తుంది. తాను అధ్యక్షుడి నిర్ణయాన్ని విమర్శించబోనన్న ట్రంప్ మద్దతుదారు, రిపబ్లికన్ పార్టీ సభ్యుడు మాట్ గాయెట్జ్ మధ్యప్రాచ్యంలో మరో నిరంతర యుద్ధానికి తెరతీయాలన్నది తప్పు నిర్ణయమవుతుందన్నారు. ఈ తీర్మానంపై గురువారం రోజంతా జరిగిన చర్చలో మెజార్టీ సభ్యులు సొలోమానీ హత్యకు సంబంధించిన ట్రంప్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఇప్పుడు ఈ తీర్మానం వచ్చే వారం సెనేట్ పరిశీలనకు రానుంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment