జనసేన పార్టీలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తర్వాత స్థానంలో ఉన్న కీలక నేత, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు పంపారు. కాగా, పవన్ కల్యాణ్ మళ్లీ సినిమా రంగంలోకి వెళ్లడమే తన రాజీనామాకు కారణమని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. “ప్రజల కోసం ఈ జీవితం అంకితం అని మీరు మొదట చెప్పారు. సినిమాలు చేయనని స్పష్టం చేశారు. ఇప్పుడు మీరు మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నారు. మీకు నిలకడలేదన్న విషయం ఈ నిర్ణయంతో వెల్లడైంది. అందుకే నేను జనసేన నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను” అంటూ లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగతంగా అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.కాగా, అజ్ఞాతవాసి తర్వాత టాలీవుడ్ కు దూరమైన పవన్ మళ్లీ ఇన్నాళ్లకు సినిమాలు చేస్తున్నట్టు మీడియాలో వచ్చింది. ఆయన ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నట్టు సమాచారం.
Post a Comment