హైదరాబాద్ అత్యాచార ఘటన మరువక ముందే.. దేశం నలుమూలల నుంచి అదే తరహాలో మహిళలు, మైనర్ బాలికలపై లైంగిక దాడులకు సంబంధించి మరిన్ని ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా సోమవారం సాయంత్రం ఒడిశాలో మరో అమాయక బాలిక కామాంధుల వలలో చిక్కుకుంది. గతంలోనే సస్పెన్షన్‌కి గురైన ఓ పోలీసు కానిస్టేబుల్ మరో ఇద్దరు దుర్మార్గులు కలిసి ఓ మైనర్ బాలికకు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి తీసుకెళ్లి పూరీలోని పోలీస్ క్వార్టర్స్‌లోనే సామూహిక అత్యాచారం చేశారు. అత్యంత హేయమైన ఈ ఘటన భువనేశ్వర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బస్సులో ఇంటికి వెళ్లే క్రమంలో మార్గం మధ్యలో నిమాపారా వద్ద దిగింది. స్నాక్స్ తీసుకునేలోపు బస్సు వెళ్లిపోవడంతో బిక్కుబిక్కుమంటూ మరో బస్సు కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అటుగా వచ్చిన కామాంధుల కళ్లు ఆమెపై పడ్డాయి. కారులో వచ్చిన సస్పెండైన కానిస్టేబుల్ జితేంద్ర సేథీ.. ఆమెకు లిఫ్ట్ ఇస్తామంటూ నమ్మబలికాడు. ఆ సమయంలో అమ్మాయికి తాను కానిస్టేబుల్‌నంటూ ఐడీ కార్డ్ కూడా చూపించాడు. అతనితో పాటు మరో ఇద్దరు కూడా కారులో ఉన్నారు. వారి మాయమాటలు నమ్మిన ఆ అమ్మాయి కారు ఎక్కింది. ఆ తర్వాత ఆమె నోరు నొక్కేసి పోలీస్ క్వార్టర్స్‌కు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెను ఆ క్వార్టర్‌లోనే ఉంచి తాళం వేసి బయటకు వెళ్లిపోయారు. అయితే, బాధితురాలి అరుపులు విని ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను రక్షించారు. కామాంధులు క్రూరత్వంతో దాడి చేస్తున్నా.. బాధితురాలు ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు. వారిని సెల్ ఫోన్ కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించింది. అలా బాధితురాలు తన సెల్ ఫోన్ కెమెరాతో చిత్రీకరించిన ఫుటేజీనే ఇప్పుడు కేసు విచారణలో కీలకంగా మారింది. అంతే కాదు.. ఏ పోలీస్ ఐడీ కార్డుతో తనకు నమ్మ కం కలిగేలా జితేంద్ర సేథీ ప్రయత్నించాడో.. అదే ఐడీ కార్డును ఆమె గట్టిగా చేతితో పట్టుకుంది. నిందితులు ఎన్నిసార్లు గుంజినా కార్డు వదిలిపెట్టలేదు. ఇప్పుడు అదే కార్డు ఆధారంగా పోలీసులు సదరు నిందితులను అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
మైనర్ బాలికపై అత్యాచారం చేసి సస్పెండైన కానిస్టేబుల్ జితేంద్ర సేథీది మొదటి నుంచి నేర చరిత్రేనని పూరీ ఎస్పీ సర్తాక్ సారంగి తెలిపారు. గతంలోనూ సొంత అత్తపైనే అత్యాచారానికి పాల్పడి అరెస్టయ్యాడని వివరించారు. అంతేకాకుండా రెండో భార్యను మంటల్లోకి నెట్టేసి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు కూడా అతనిపై కేసులు ఉన్నాయన్నారు. క్రిమినల్ మైండ్ ఉన్న కారణంగానే గత కొంత కాలం నుంచి అతన్ని సస్పెన్షన్‌లో ఉంచినట్లు ఎస్పీ సర్తాక్ సారంగి వెల్లడించారు.
Post a Comment