రైతు ధర్నా చేస్తున్న వాళ్లందరూ టీడీపీకి అనుకూలమైన వాళ్లని, పెయిడ్ ఆర్టిస్టులని వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ కార్యకర్తే ఖండించాడు. ‘మూడు రాజధానుల’కు నిరసనగా రైతులు చేపట్టిన కార్యక్రమాల్లో సదరు కార్యకర్త పాల్గొ్న్నాడు.‘టీడీపీకి అనుకూలమైన వాళ్లే ధర్నా చేస్తున్నారంటున్నారు కాబట్టి చెబుతున్నాను.. నేను వైసీపీ కార్యకర్తను. మాది మందడం గ్రామం. ఇక్కడ నాకూ భూమి ఉంది. నేనూ రాజధానికి ల్యాండ్ ఇచ్చాను. ఆ బాధ ఏంటో మాకు తెలుస్తుంది’ అని అన్నారు. అమరావతిలో రాజధాని వద్దని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.‘మేము వైసీపీ కార్యకర్తలమే, జగన్ వెంట పాదయాత్ర చేసినవాళ్లమే’ అంటూ మరికొంత మంది రైతులు పేర్కొన్నారు. ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అనడం కరెక్టు కాదని, తమ ఆందోళన కొనసాగిస్తామని, అవసరమైతే ఢిల్లీ స్థాయికి తీసుకెళతామని హెచ్చరించారు. ఇక్కడ ఏ పార్టీలు, ఏ కులం లేదని, ‘రైతు కులం’ ఒక్కటే ఉందని, రైతులందరమూ పోరాడతామని, ఎక్కడికైనా వెళతామని చెప్పారు.
Post a Comment