ఇసుక కొరతకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలను జారీ చేశారు. ఈరోజు అధికారులతో ఇసుక సమస్యను జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఇసుక డిమాండ్ సరాసరి 80 వేల టన్నులుగా ఉండేదని… అయితే, వరదల కారణంగా ఆ డిమాండ్ ను చేరుకోలేకపోయామని చెప్పారు. గత వారం రోజులుగా పరిస్థితి మెరుగుపడిందని… రీచ్ ల సంఖ్య 60 నుంచి 90కి చేరిందని తెలిపారు. ఇసుక స్టాక్ పాయింట్లను 137 నుంచి 180కి పెంచాలని ఆదేశించారు.
నియోజకవర్గాల వారీగా రేటు కార్డును ప్రకటించాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఎల్లుండిలోగా ఇసుక రేటు కార్డును నిర్ణయించాలని… ఎక్కువ ధరకు ఇసుకను అమ్మేవారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సరిహద్దుల్లోని అన్ని రూట్లలో చెక్ పోస్టులు పెట్టాలని ఆదేశించారు. 10 రోజుల్లోగా చెక్ పోస్టులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అన్నారు.
Post a Comment