అమరావతి పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాన్వాయ్ పై రాళ్లు, చెప్పులతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై టీడీపీ నాయకులు స్పందిస్తూ పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం వెంటనే స్పందించింది. చంద్రబాబు అమరావతి పర్యటన సందర్భంగా రాళ్లు విసిరింది, చెప్పులు వేసింది నిరసనకారులేనని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆ సమయంలో తీవ్ర ఆవేశంలో ఉన్న నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్రస్థాయి ఘటనలు చోటుచేసుకోలేదని, అయితే ఈ ఘటనలో టీడీపీ నేతలు పోలీసులనే తప్పుబట్టడం సరికాదని అన్నారు. అపార రాజకీయ అనుభవం ఉన్న ఓ మాజీ ముఖ్యమంత్రిపై తాము ఎందుకు చెప్పుల దాడి చేయిస్తామని శ్రీనివాసరావు ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి చిన్న సంఘటన జరిగినా దాన్ని పోలీసులకు ఆపాదిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై తరచుగా ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదని స్పష్టం చేశారు.
Post a Comment