లాకప్​ డెత్​ కేసు: మరియమ్మ కుమారుడిని పరామర్శించిన డీజీపీ


 

లాకప్  డెత్ మృతురాలు మరియమ్మ కుమారుడిని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఇవాళ హెలికాప్టర్ లో ఖమ్మం వెళ్లిన ఆయన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ ను కలిసి ఘటనపై ఆరా తీశారు. ఓ దొంగతనం కేసులో అడ్డగూడూరు పోలీసులు మరియమ్మ, ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్, ఆమె కూతురును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


అయితే, మరియమ్మ పోలీస్ స్టేషన్ లో చనిపోవడంతో ఆ ఘటన వివాదాస్పదమైంది. పోలీసులు కొట్టడం వల్లే తమ తల్లి చనిపోయిందని ఆమె పిల్లలు ఆరోపించారు. రాజకీయ పార్టీలు ఆందోళనలు చేశాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మరియమ్మ కుటుంబానికి రూ.15 లక్షల సాయం, ఆమె కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగాన్నిస్తున్నట్టు ప్రకటించారు. అంతేగాకుండా దళితులపై దాడులు జరగకుండా చూడాలంటూ డీజీపీని ఆదేశించారు.


దీంతో ఆయన ఇవాళ ఖమ్మం వెళ్లి ఘటనపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. విచారణ చేసేటప్పుడు ఎంత మంది కొట్టారని ఉదయ్ కిరణ్ ను అడిగి తెలుసుకున్నారు. దీంతో ఉదయ్ కన్నీరుమున్నీరయ్యాడు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని డీజీపీ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఘటనకు కారకులైన పోలీసులను సస్పెండ్ చేశామన్నారు. మరియమ్మ ఘటన బాధాకరమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ తేల్చి చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, విచారణ అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post