బిజెపి ఎంపీ అరవింద్ వాహనంపై కోడిగుడ్లతో దాడి!



 నిజామాబాద్  జిల్లా ఎర్గట్ల మండలంలో పర్యటిస్తున్న వేళ బీజేపీ నేత, పార్లమెంట్ సభ్యుడు అరవింద్ పై కోడిగుడ్లతో దాడి జరగడం ఉద్రిక్తతలకు దారితీసింది. తాళ్లరాంపూర్ గ్రామంలో జరుగుతున్న ఓ నిరసన కార్యక్రమానికి అరవింద్ వచ్చిన వేళ ఈ ఘటన జరిగింది. ఆయన వాహనాన్ని కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోగా, వారిని నిలువరించేందుకు బీజేపీకి చెందిన కొందరు ప్రయత్నించారు.


ఇదే సమయంలో టీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్, ఎంపీ వాహనంపైకి కోడిగుడ్లను విసరడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో స్థానిక బీజేపీ నేత ఒకరికి గాయాలు కాగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు.


ఆపై మాట్లాడిన అరవింద్, టీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే, బీజేపీ శ్రేణులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ తాను వేసుకునే చెప్పులతో సమానమని అన్నారు. ఇదే సమయంలో కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. పొరండ్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, బైంసాలో ముస్లింలతో పాటు హిందువులపై కూడా ఆయన అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.


Post a Comment

Previous Post Next Post